శ్రీదివ్యకు అవకాశాల క్యూ
శ్రీదివ్యకు కోలీవుడ్‌లో గిరాకీ పెరుగుతోంది. సినీరంగంలో ఒక్క విజయం తారల తలరాతలనే మార్చేస్తుంది. ఇందుకు ఉదాహరణ లెన్నో. శ్రీదివ్య ఇదే కోవకు చెందుతుంది. టాలీవుడ్‌లో విజయం కోసం పోరాడిన ఈ తెలుగమ్మాయికి కోలీవుడ్‌లో విజయం లభించింది. తొలి చిత్రం వరుత్త పడాద వాలిభర్ సంఘంతోనే శ్రీదివ్య హిట్ చిత్రాల నాయికల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మను రెండు అవకాశాలు వరించాయి.
అందులో ఒకటి ప్రముఖ యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ సరసన నటించే పెన్సిల్ చిత్రం. విష్ణు, విశాల్ హీరోగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలోనూ శ్రీ దివ్య నాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి వీర ధీరమారన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. శ్రీదివ్య మాట్లాడుతూ సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో తాను కళాశాల విద్యార్థినిగా నటించనున్నట్లు తెలిపింది. ఈ పాత్ర తనకు చాలా నచ్చిందని చెప్పింది.
చిత్ర షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుందని వెల్లడించింది. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలని కోరుకుంటున్నానని స్పష్టం చేసింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలలో నటించే విషయమై చర్చలు సాగుతున్నట్లు పేర్కొంది. చదువు, నటన రెండింటినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపింది.