
అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు
ఆశ కైనా హద్దులుండాలన్నది నీతి సూక్తి. ఎంత ప్రతిభ, ప్రాచుర్యం ఉన్నా అత్యాశకు పోతే బెడిసికొడుతుంది. ఈ విషయం నటి శ్రీ దివ్యకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. టాలీవుడ్‌లో చిన్నచిత్రాలు చేసుకుంటున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి కోలీవుడ్‌లోకి వరుత పడాద వాలిబర్ సంఘం చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. తొలి చిత్రమే అమ్మడికి అనూహ్య విజయాన్ని ఇచ్చిం ది. అదనంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను కట్టబెట్టింది. అంతే మరో చిత్రం విడుదల కాకుండానే నాలుగైదు చిత్రాల అవకాశాలు ఈ అమ్మడి ముంగిట వాలాయి.
అటు సక్సెస్, ఇటు ఛాన్స్‌లు శ్రీ దివ్యను సంతోషంలో ముంచెత్తాయి. యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న పెన్సిల్ చిత్రంలో అవకాశం పొంది ఆయన తొలి హీరోయిన్‌గా పేరొందింది. అలాగే శిష్ణు, విశాల్ సరసన జీవా, చిత్రంలోను, అధర్వతో ఈట్టి చిత్రంలోను, శివకార్తికేయన్‌కు జంటగా టాణా చిత్రంలోను నటిస్తూ ప్రముఖ యువ హీరోయిన్లకు పోటీగా తయారైంది. ఇంతవరకు బాగానే ఉంది. హీరోయిన్‌గాను మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇలా చేతి నిండా చిత్రాలు ఉండడంతో అమ్మడిమైండ్ సెట్ మారిపోయిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది.
పారితోషికం ఒక్కసారిగా పెంచేసిందట. చిన్న చిత్రాల అవకాశాలు వెల్లువెత్తుతుంటే అలాంటి వాటిని నిలువరించడానికి ఈ ముద్దుగుమ్మ అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ బ్యూటీకి భారీ అవకాశం వచ్చింది. అదే కార్తీ సరసన కొంబన్ చిత్రంలో నటించే లక్కీఛాన్స్. అయితే అలవాటులో పొరపాటులా ఈ చిత్రానికి శ్రీదివ్య రూ.50 లక్షలు పారితోషికం డిమాండ్ చేసిందట. దీంతో షాక్ అయిన చిత్ర దర్శక, నిర్మాతలు ఆమెకు అవకాశం ఇచ్చే ఆలోచనకు నీళ్లుదొలివేశారు. ఇప్పుడా అవకాశం మరో లక్కీ హీరోయిన్ లక్ష్మీమీనన్‌ను వరించింది. శ్రీదివ్యకు ఈ భారీ అవకాశం అలా పోయింది.