
ఈ రోజుల్లో కామెడీ కొత్త పుంతలు తొక్కుతోంది. స్టాండప్ కామెడీ షోలను జనాలు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది స్టాండప్ కమెడియన్లు పుట్టుకొచ్చారు. అయితే నవ్వించడానికి ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదని అలెగ్జాండర్ బాబు నిరూపించాడు. ఓ పాట.. దానికి ముందు మాట.. వీటన్నింటి కన్నా ముందు సెలబ్రిటీలు. వీటిని ఆధారంగా చేసుకుని తన మాటలతో కామెడీని పండిస్తున్నాడు. యూట్యూబ్ స్టార్ కమెడియన్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. విమర్శలు, కామెడీ, మ్యూజిక్ అన్నింటి మేళవింపుతో చేసే అతని వీడియోలకు మిలియన్ల వ్యూస్ దక్కుతాయంటే అతని క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేమస్ పర్సనాలిటీస్‌పై అతను వేసే పంచ్‌లు, సెటైర్‌లే అతని కామెడీకి ప్రధానాధారం. తమిళ గాయకుడు ఏసుదాసు దగ్గర నుంచి తెలుగు సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వరకు అందరినీ తన కామెడీలో భాగం చేశాడు.
అయితే అలెగ్జాండర్ కామెడీ వ్యంగ్యంగానే సాగినా ఎవరి మనోభావాలను నొప్పించకపోవడం గమనార్హం. ఇక తాజాగా అతను ఏసుదాసుకు నివాళిగా అర్పించిన వీడియోలో సింగర్స్‌తోపాటు టాలీవుడ్ ‘లెజెండ్’ బాలయ్యను కూడా వాడుకున్నాడు. మిడ్‌నైట్ మసాలా హీరోయిన్లు కూడా బాలకృష్ణ స్టెప్పులకు బెంబెలెత్తుతారని పేర్కొన్నాడు. ‘మాస్టర్ ఈ స్టెప్పు చెప్పనేలేదు అని వారు వారించినా అతనికి నచ్చింది చేస్తాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కష్టానికి తగిన న్యాయం చేస్తానంటూ అతనికి నచ్చినట్టుగా డాన్స్‌లు చేస్తాడు’ అని కామెంట్ చేశాడు. దీంతో అతన్ని చూసిన హీరోయిన్లు పారిపోతారు అని జోక్ పేల్చాడు. దీనికి అక్కడి జనం పగలబడి నవ్వినా బాలయ్య అభిమానులు మాత్రం కాస్త హర్ట్ అయ్యారు. అయితే, ఇలా ధైర్యంగా సెలబ్రిటీలపై పంచ్‌లు విసురుతూ కామెడీ చేసి అందులో విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఇందుకుగానూ తమిళంలో ప్రముఖ సంస్థ బిహైండ్ వుడ్స్ గోల్డ్ మిక్.. అలెగ్జాండర్‌కు ‘ఇండియాలోనే బెస్ట్ మ్యూజికల్ స్టాండప్ కమెడియన్’ అవార్డు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment