పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్‌ | Sudhakar Intrest in Cinematography | Sakshi
Sakshi News home page

పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్‌

Published Wed, May 22 2019 7:58 AM | Last Updated on Wed, May 22 2019 7:58 AM

Sudhakar Intrest in Cinematography - Sakshi

లఘు చిత్రం షూటింగ్‌ లొకేషన్‌లో..

జూబ్లీహిల్స్‌: చలన చిత్రం.. ఈ పరిశ్రమ ఎందరికో కలల ప్రపంచం. ఇందులో రాణించాలని వేలాది మది ఉవ్విళ్లూరుతుంటారు. అదే కలగా జీవిస్తుంటారు. కొందరు విజయం సాధిస్తుంటారు.. ఇంకొందరు అవకాశాలు రాక వెనుదిగుతుంటారు. కొందరు మాత్రమే తాము అనుకున్న లక్ష్యానికి చేరుకునేందుకు ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుని తమకు అనుకూలంగా మలచుకుంటారు. అలాంటి వారిలో ఒకడు ‘సుధాకర్‌’. కెమెరాపై ప్రేమ పెంచుకున్న ఈ యువకుడు పీసీ శ్రీరామ్‌ అంతటి సినీమాటోగ్రాఫర్‌గా ఎదగాలని గ్రామం నుంచి సిటీకి వచ్చాడు. తన జర్నీలో భాగంగా పొట్టి (షార్ట్‌ ఫిలింమ్స్‌) చిత్రాలు రూపొందించడంలో తనదైన ముద్ర వేశాడు ఈ సూర్యాపేట కుర్రాడు.

యాత్ర అలా మొదలైంది..
సూర్యాపేటకు చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి నుంచీ ఫొటోగ్రఫీ అంటే పిచ్చి. తండ్రి కొనిచ్చిన చిన్ని కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా స్మార్ట్‌ ఫోన్ల రావడం.. వాటిలో అత్యుత్తమ నాణ్యత గల కెమరాలు ఉండడంతో ఫోన్‌తోనూ లఘు చిత్రాలు తీసి భళా అనిపించుకున్నాడు. పెద్ద చిత్రాలను షూట్‌ చేసే క్రమంలో ప్రయోగాలకు అంత అవకాశం ఉండదు. ఎంతో ఎత్తుకు ఎదిగితేగాని అలా చేయలేం. దాంతో పొట్టి చిత్రాలు రూపొందించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ఫొట్రోగ్రఫీ ప్రయోగాలకు అనువుగా మార్చుకున్నాడు. ప్రతి లఘు చిత్రాన్ని దేనికదే కొత్తదనంతో తీర్చిదిద్దాడు. అలా ఇప్పటిదాకా సుధాకర్‌ దాదాపు 200కు పైగా షార్ట్‌ ఫిలిమ్స్‌కు కెమెరామెన్‌గా పనిచేసాడు. సుధాకర్‌ ఫొటోగ్రఫీ అందించిన ‘హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ, శ్వాసనువ్వే, రుధిరం, సిక్త్స్‌ సెన్స్‌’ వంటి లఘుచిత్రాలు యూట్యూబ్‌లో పెద్దహిట్‌. వీటితో మంచి గుర్తింపు సైతం తెచ్చుకున్నాక.. ఇతడి ప్రతిభను గుర్తించిన నిర్మాతలు ఇటీవల విడుదలైన ‘రహస్యం’ చలనచిత్రానికి పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా అవకాశం కల్పించారు. మరో రెండు సినిమాలకు కూడా ఛాయా గ్రాహకుడిగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు సుధాకర్‌.  

ఆర్‌జీవీ స్ఫూర్తిగా..
ఫొటోగ్రఫీ తిలక్‌ వద్ద నేర్చుకున్నాను. మావూరి వంట కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పనిచేసాను. రామ్‌గోపాల్‌ వర్మ స్ఫూర్తిగా డబ్బులు కూడబెట్టుకుని 5డీ కెమెరా కొని షార్ట్‌ఫిలిమ్స్‌కు పనిచేశాను. వాటితో మంచి గుర్తింపు వచ్చింది. పెద్ద చిత్రాలకు పనిచేసే అవకాశాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. నాఫేస్‌బుక్‌ పేజ్‌కు  5వేల మంది, ఇన్‌స్ట్రాగామ్‌ పేజ్‌కు 4వేల మంది అభిమానులు ఉన్నారు. ఈ రంగంలో మంచి  సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను. – సుధాకర్, షార్ట్‌ఫిలిమ్స్‌ సినిమాటోగ్రాఫర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement