అప్పుడు మా ఆవిడ చంపేస్తుంది! | Sukumar Exclusive Interview | Sakshi
Sakshi News home page

అప్పుడు మా ఆవిడ చంపేస్తుంది!

Published Tue, Aug 1 2017 10:48 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

అప్పుడు మా ఆవిడ చంపేస్తుంది!

అప్పుడు మా ఆవిడ చంపేస్తుంది!

‘‘నేను నిర్మాతగా వ్యవహరించే సినిమాల చిత్రీకరణలకు అస్సలు వెళ్లను. నేనొక్క రోజు సెట్‌కు వెళ్లినా ఆ సినిమా సుకుమారే డైరెక్ట్‌ చేశాడంటారు. పైగా, నాకో విజన్‌ ఉంటుంది. ఆయా దర్శకులకు వేరే విజన్‌ ఉంటుంది. నేనేదో ఉచిత సలహా ఇచ్చి, వాళ్ల కష్టాన్ని తక్కువ చేయడం ఎందుకు? అందుకే, ‘కుమారి 21ఎఫ్‌’ సెట్‌కి గానీ, ఈ ‘దర్శకుడు’ సెట్‌కి గానీ వెళ్లలేదు’’ అన్నారు సుకుమార్‌. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి ఆయన నిర్మించిన ‘దర్శకుడు’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుకుమార్‌ చెప్పిన విశేషాలు...

‘దర్శకుడు’ ఎలా ఉన్నాడు?
ఓ ప్రేక్షకుడిగా చూశా. చాలా బాగున్నాడు. సినిమా చూసినప్పుడు కొన్నిసార్లు మనకు రిజల్ట్‌ తెలుస్తుంది. లేదంటే ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పలేం! అందమైన ప్రేమకథా చిత్రమిది. నా తరహా సినిమా కాదు.

తెరపై దర్శకుణ్ణి చూసినప్పుడు మీకు మీరు గుర్తొచ్చారా?
లేదు. నా కథ కాదిది. అందులో నా పాత్ర ఏం లేదు. సెట్‌లో కాస్ట్యూమ్‌ డిజైనర్‌తో ప్రేమలో పడ్డ దర్శకుడి కథ. (నవ్వుతూ...) నేనలా చేస్తే మా ఆవిడ చంపేస్తుంది కాబట్టి... నాకలాంటి ఎక్స్‌పీరియన్స్‌ లేదు.

హీరోగా చేసిన మీ అన్న కొడుకు అశోక్‌ బాడీ లాంగ్వేజ్‌ మీలాగే ఉందట?
ఏదైనా పాత్రలో నటించేటప్పుడు అలాంటి వ్యక్తులను అబ్జర్వ్‌ చేస్తారు కదా. అందులోనూ దర్శకుడి పాత్ర. తనకు ఎక్కువ తెలిసిన దర్శకుణ్ణి, కళ్ల ముందున్నది నేనే. కొన్నిసార్లు నాకు కోపం వచ్చినప్పుడు చేతిలో ఉన్నది విసిరేస్తా. అటువంటి సీన్స్‌లో ‘చిన్నాన్న అయితే ఎలా చేస్తాడు?’ అని ఊహించుకుని చేశాడేమో! నిజం చెప్పాలంటే... సీరియస్‌ ఎమోషనల్‌ సీన్స్‌లో అనుభవమున్న నటుడిలా అశోక్‌ బాగా చేశాడు.

మీ లైఫ్‌లోంచి ఓ సీన్‌ కాపీ చేశానని హరిప్రసాద్‌ అన్నారు. ట్రైలర్‌లోని ఆ సీన్‌ చూసి మీ వైఫ్‌ ఏమన్నారు?
(నవ్వుతూ...) ‘నా సీన్‌ కాపీ కొట్టేశావ్‌’ అని తిట్టింది. ఫస్ట్‌లో తనకు సినిమాల గురించి ఏం తెలీదు. ఆమెది హైదరాబాద్‌. ఎక్కువ హిందీ సినిమాలు చూసేది. నా సిన్మాలు చూడలేదు. ‘డైరెక్షన్‌ అంటే నువ్వేం చేస్తావ్‌’ అనడిగింది. తన డౌట్‌ ఏంటంటే... ‘డ్యాన్స్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ చేస్తాడు, ఆర్టిస్ట్‌ యాక్ట్‌ చేస్తాడు, ఇలా అందరూ అన్నీ చేస్తే నువ్వేం చేస్తావ్‌?’ అంది. ఆర్టిస్టులకు ఎలా చేయాలో చెబుతానన్నా. ‘అల్లు అర్జున్‌కు చెబుతావా నువ్వు? బన్నీ ఆ మాత్రం చేయలేడా? నువ్వు చెప్పేదేంటి!’ అంది. కొన్నాళ్లు తనది ఇన్నోసెన్సా? మరొకటా? అర్థం కాలేదు. సెట్‌లో కూడా అప్పుడప్పుడూ అందరూ తమ తమ పనులు చేసేస్తుంటే... ‘ఇక్కడ నా జాబ్‌ ఏంటి?’ అనే భయం వేస్తుంది. వాళ్లు సరిగ్గా చేసినా, ఏదొకటి మార్పులు చెబుతాం. చివరకు, ఎడిటింగ్‌లో వాళ్లు చేసిందే పెట్టుకుంటాం.

మామూలుగా ఎప్పుడైనా మీ వైఫ్‌ మిమ్మల్ని తిట్టిన, కోప్పడిన సందర్భాలున్నాయా?
ఫ్యామిలీకి ఎక్కువ టైమ్‌ కేటాయించలేదని ఫీలవుతుంటుంది. ఇంటికి వెళ్లినప్పుడు అబ్బాయి ఏం చేశాడో చూడమని మా ఆవిడ చూపిస్తుంది. ఆనందపడతా. కానీ, నా సినిమా హిట్టయితే ఉన్నంత ఆనందం ఉండదేమోననే డౌట్‌. ఒక్కోసారి పర్సనల్‌ లైఫ్‌ను నెగ్లెక్ట్‌ చేస్తాం. ‘దర్శకుడు’లోనూ అంతే. అతని లైఫ్‌లో ప్రేమ, దర్శకత్వం రెండూ ఉంటాయి. కానీ, వాడు దర్శకత్వానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్‌ ప్రేమకు ఇవ్వడు. ఉదాహరణకు... మా ఆవిడతో షాపింగ్‌కు వెళ్లినప్పుడు తను రెండు డ్రస్సులు చూపిస్తే.. ‘బాగున్నాయి, రెండూ తీసుకో’ అన్నా. అలాంటి నేను ఓసారి తమన్నా కాస్ట్యూమ్‌ బాగోలేదని రెండు గంటలు ‘100% లవ్‌’ షూటింగ్‌ ఆపేశా. కాస్ట్యూమ్స్‌ తెప్పించి వెతుకుతుంటే, వెనుక మా ఆవిడ ఉంది. ‘హీరోయిన్‌ కోసం ఇంత టైమ్‌ కేటాయించావ్‌. నాకోసం లేదు’ అని అలిగింది. ఆమెను బుజ్జగించడానికి కొంచెం టైమ్‌ పట్టింది (నవ్వుతూ).

‘దర్శకుడు’ సినిమా ట్రైలర్‌లో ‘దర్శకత్వమంటే 20 శాతం క్రియేటివిటీ, 80 శాతం మేనేజ్‌మెంట్‌’ డైలాగ్‌పై మీ ఫీలింగ్‌?
కథ రాసేంత వరకు మన చేతిలో ఉంటుంది. తర్వాత ఒప్పించడానికి కొందర్ని మేనేజ్‌ చేయాలి. అలాగని, వాళ్లేం తప్పు చేయడం లేదు. నేను, వాళ్లూ అందరికీ నచ్చాలనే క్రమంలో క్లాష్‌ తప్పదు. తర్వాత సెట్‌కి వెళ్లగానే ఓ ఐదొందల మందిలో ఎవరినీ నొప్పించకుండా, సినిమాను కంప్లీట్‌ చేయాలి. అప్పుడు.. 20 శాతం క్రియేటివిటీ అనేది 100 శాతం. 80 శాతం మేనేజ్‌మెంట్‌ అనేది 20 శాతం. 20 శాతం ఎఫర్ట్స్‌తో 80 శాతం మేనేజ్‌మెంట్‌ చేయాలి. 80 శాతం ఎఫర్ట్స్‌తో 20 శాతం క్రియేటివిటీ చూపాలి.

నెక్ట్స్‌ ఏంటి? అశోక్‌ను హీరోగా కంటిన్యూ చేస్తారా? దర్శకుణ్ణి చేస్తారా?
చేతిలో ఓ పనుంటే దాంతో ఎలాగైనా బతకొచ్చు. అశోక్‌ మంచి రైటర్‌. అయితే...  ఈ సిన్మా రిజల్ట్‌ బట్టి తన ఫ్యూచర్‌ ఉంటుంది. సూపర్‌ హిట్టయితే హీరోగా రెండు ఛాన్సులొస్తాయి. లేదంటే... దర్శకుడవుతాడు.

లాజిక్స్‌తో సినిమా తీసే మీరు ఎప్పుడో 1985లోకి వెళ్లి పల్లెటూరి నేపథ్యంలో ‘రంగస్థలం’ తీస్తున్నారేంటి?
ఎప్పట్నుంచో పల్లెటూరి నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుంది. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’తో అది కుదిరింది. కథ ప్రకారమే 1985 నేపథ్యం ఎంచుకున్నా. ప్రయోగమేమీ కాదు, మంచి కమర్షియల్‌ సినిమా. 85లోకి వెళ్లి తీస్తేనే కథ వర్కౌట్‌ అవుతుంది. అప్పుడు సెల్‌ఫోన్స్‌ లేవు కదా. అలాంటి లాజిక్స్‌ కొన్ని ఉన్నాయి. పాపికొండల్లో సెల్‌ సిగ్నల్స్, పొల్యూషన్‌ లేని చోట చిత్రీకరించాం. మీరు నమ్మరు నాకు కొన్ని హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు ఏం లేవు. ఆరోగ్యంగా ఉన్నా. ఇక్కడికి రాగానే మళ్లీ మొదలు.

మీరు మ్యాథ్స్‌ లెక్చరర్‌ కదా! మీ దగ్గర్నుంచి సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ఆశించొచ్చా?
సైన్స్‌ ఫిక్షన్‌ చేయాలంటే ఇక్కడి మార్కెట్‌ చాలదు. హిందీలో చేయాలి. అలాంటి కాన్సెప్ట్స్‌ నా దగ్గర కొన్ని ఉన్నాయి. కానీ, అవి వర్కౌట్‌ అవ్వాలంటే చాలా కుదరాలి. భారీ బడ్జెట్‌తో తీసేంత లిబర్టీ రావాలంటే కంటిన్యూస్‌ సక్సెస్‌లు ఉండాలి.

పూరి జగన్నాథ్‌ డ్రగ్స్‌ ఇష్యూ వార్తలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది?
ఆయనకు ఇంకో మంచి కథ దొరికిందనిపిస్తుంది. ఆయన చాలా స్ట్రాంగ్‌. పూరీతో మాట్లాడితే... ఆయన మనసెంత అందమైనదో తెలుస్తుంది. ఐ లవ్‌ హిమ్‌. ఆయన్ను కలవాలని ఓ రోజు ఇంటి వరకు వెళ్లా. లేరన్నారని వచ్చేశా. వెంటనే కాల్‌ చేశా. ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement