‘ఎందుకమ్మా నన్నింత నల్లగా కన్నావు’ అంటే ‘నిన్ను ఎర్రగా కని ఉంటే త్వరగా మాసిపోయేవాడివి కదా’ అంటుంది అమ్మ.‘ఎవరిని పట్టుకుని నలుపు అంటున్నావ్.. ఇది గ్యారంటీ కలర్’ అంటాడు శివాజీ వాళ్ల మామయ్య. రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. ఈ నల్ల ఆ నల్ల కాదు. తమిళంలో నల్ల అంటే మంచి అని. డిసెంబర్ 12 రజనీకాంత్ జన్మదినం సందర్భంగా ఆయన అన్నయ్య సత్యనారాయణ రావ్ ఈ తంబి గురించి ‘సాక్షి’తో పంచుకున్న నల్ల సంగతులు.
►రజనీకాంత్‌గారి బర్త్‌డే (డిసెంబర్ 12) సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలనిపించింది. అందుకే ఈ ఇంటర్వ్యూ...
సత్యనారాయణ రావ్: చాలా సంతోషం.
►ఇప్పుడంటే రజనీగారి పుట్టిన రోజులు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఆయన ఫ్యాన్స్ అయితే ఓ పండుగలా చేస్తున్నారు. చిన్నప్పుడు ఆయన బర్త్‌డేలు ఎలా జరిగేవి?
ఇంటివరకే పరిమితం అయ్యేది. మా అమ్మగారు ఉన్నంతవరకూ సింపుల్‌గా చేసేవారు. రజనీకి తొమ్మిదేళ్ల వయసప్పుడు మా అమ్మగారు చనిపోయారు. అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. అమ్మ చనిపోయిన ఏడాదికి నాకు పెళ్లయింది. అప్పటినుంచి మా ఆవిడే రజనీ బర్త్‌డేలు చేయడం మొదలుపెట్టింది. అది కూడా సింపుల్‌గానే. పాయసం, పూరి, వడ.. ఆయన బర్త్‌డే అంటే ఈ మూడూ చేసేది. మా దగ్గర ఆయన ఉన్నంతవరకూ ఇదే ఆనవాయితీ.
► జనరల్‌గా తమ్ముడి గురించి చెప్పేటప్పుడు ‘వాడు’ అంటుంటారు. మీరేమో ‘ఆయన’ అంటున్నారు. స్టార్ కాబట్టి అలా అనాల్సి వచ్చిందా?
అదేం కాదు. మాకు ‘ఏరా.. పోరా’ అని పిలుచుకునే అలవాటు చిన్నప్పుడే లేదు. ‘ఎన్నప్పా.. వాప్పా.. పోప్పా’ (ఏమప్పా.. రాప్పా.. పోప్పా) అంటుంటాను. తను కూడా నన్ను అంతే. పిలుపులు గౌరవంగా ఉన్నప్పటికీ అవేవీ మా అనుబంధాన్ని దూరంగా ఉంచినట్లు కాదు.
►రజనీగారికి తోడబుట్టినవాళ్లు ఎంతమంది?
ఒక అక్క, తన తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, రజనీ నాలుగో ఆయన. మా అక్కకి పదహారేళ్ల వయసులోనే పెళ్లయింది. తమ్ముడు చనిపోయాడు. రజనీ, నేను కలిసి పెరిగింది ఎక్కువ.
► మీ ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్లేవారా? కథలు చెప్పుకునేవారా?
బోల్డన్ని కథలు చెప్పుకునేవాళ్లం. ముఖ్యంగా రాజుల కథలు చదివేవాళ్లం కూడా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కథ, మహాభారతం చెప్పుకునేవాళ్లం. రజనీకి శివాజీ కథ అంటే ఇష్టం. ఇక సినిమాల గురించి చెప్పాలంటే.. రజనీ ఎక్కువగా తమిళ సినిమాలు, నేను కన్నడ సినిమాలు చూసేవాళ్లం. అందుకని దాదాపు విడివిడిగానే వెళ్లేవాళ్లం. రజనీకి ఎంజీఆర్, శివాజీ గణేశన్‌గార్ల సినిమాలంటే చాలా ఇష్టం.
► సినిమాల్లో శివాజీ, హిస్టరీలో ఛత్రపతి శివాజీ అంటే ఇష్టం అన్న మాట. రజనీగారి రియల్ నేమ్ కూడా శివాజీరావ్ గైక్వాడ్ కదా?
అమ్మానాన్న పెట్టిన పేరు అదే. సినిమాల్లోకి వచ్చాక డైరెక్టర్ కె. బాలచందర్‌గారు పేరు మార్చా రు. ఆ పేరే స్థిరపడిపోయింది.
► చిన్న రజనీ అల్లరిపిల్లవాడేనా?
(నవ్వేస్తూ) రుంబ కురుంబు (బాగా అల్లరి). అయితే ఫ్రెండ్స్‌తో బాగా గొడవలు పడటం లాంటివి ఉండేవి కాదు. ఎప్పుడైనా చిన్న చిన్న తగాదాలు ఆడటం, ఆ తర్వాత వెంటనే కలిసిపోవడం. రజనీకి ఫుట్‌బాల్, కబడ్డీ అంటే ఇష్టం.
► మరి ఆటల్లో తొండి చేయడం, ఓడిపోయినప్పుడు ఫీలవ్వడం లాంటివి?
రజనీకి ఓటమి అనేది లేదు. ఎప్పుడూ విజయమే. ఆటల్లో ఫస్ట్. చదువులో కూడా బెస్టే. చిన్నప్పుడే మంచి భావాలు ఉండేవి. ఏదైనా అన్యాయం అనిపిస్తే వెంటనే ఎదురు తిరిగి అడగడం లాంటివి.
► ‘శివాజీ’ సినిమాలో నల్లగా ఉన్న రజనీ పాత్ర తెల్లబడటానికి ట్రై చేస్తుంది. ‘బాబా’ సినిమాలో ‘గ్యారంటీ కలర్’ అని ఓ పాటలో వస్తుంది. రజనీగారు ‘నల్ల పయ్యనే కదా’?
(నవ్వేస్తూ) అవును. నల్ల పయ్యన్ (మంచి అబ్బాయి). రుంబ రుంబ నల్ల పయ్యన్ (చాలా చాలా మంచి అబ్బాయి).
► మీ అమ్మగారు చనిపోయాక రజనీగారు, మీ నాన్నగారు మీ కుటుంబంతోనే ఉండేవారా? తమ్ముడి స్కూల్ ఫీజులు మీరేమైనా కట్టేవారా?
నాన్నగారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేసేవారు. 55 ఏళ్లకు రిటైర్ అయ్యారు. 30 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఆ తర్వాత 50, 100. 1985లో నాన్న చనిపోయారు. అప్పటికి ఆయనకు 150 రూపాయలు వచ్చేది. నాతోనే ఉండేవారు. రజనీ స్కూల్ ఫీజులు కట్టేవాడిని. నాకు తనని బాగా చదివించాలని ఉండేది. డాక్టర్ చేయాలని కోరిక. బాగా చదువుకుంటే సీట్ వస్తుంది.. డాక్టర్ అవ్వొచ్చు అనేవాడిని. అయితే డ్రామాల్లో నటించడం మొదలుపెట్టాక రజనీ మైండ్ డైవర్ట్ అయింది.
► మరి ఎంతదాకా చదువుకున్నారు?
ప్లస్ టు వరకే. చిన్నప్పుడు రజనీని రామకృష్ణ మిషన్ వాళ్లు స్థాపించిన రామకృష్ణ మఠంలో చేర్పించాను. స్కూల్ అయిపోగానే మఠంకి వెళ్లేవాళ్లం. నేను ప్రార్థనలు చేసేవాడిని. రజనీ అయితే వేద మంత్రాలు నేర్చుకుని, అక్కడ సేవలు కూడా చేయడం జరిగింది. ఆ మఠంలో ఏడాదికి ఒకసారి డ్రామాలు వేసేవారు. ఆ డ్రామాల్లో ఉత్సాహంగా పాల్గొన్న రజనీకి అప్పుడే యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ మొదలైంది. రామకృష్ణ మఠంలో మాత్రమే కాకుండా విడిగా స్టేజ్ నాటకాల్లోనూ నటించడం స్టార్ట్ అయింది. దాంతో చదువు మీద ఆసక్తి పోయింది.
► మీరు మందలించలేదా?
అలా ఏం లేదు కానీ కాలేజీకి వెళ్లకపోవడంతో ఖాళీగా ఉండటంవల్ల మాకు తెలిసిన ఆయన రజనీని కండక్టర్‌గా చేర్పించారు. ఆ జాబ్‌లో జాయిన్ అయినా ధ్యాస అంతా నాటకాల మీదే. ఫ్రెండ్స్‌తో కలిసి నాటకాలు వేయడం అలవాటైంది. అప్పుడు తన స్నేహితులు ‘నీ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. నువ్వు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితే అవకాశాలు వస్తాయి’ అన్నారు. దాంతో తనకి కూడా ఆసక్తి పెరిగి, మదరాసు వెళ్లడం జరిగింది.
► కండక్టర్ జాబ్ రిజైన్ చేసి, మదరాసు వెళతానంటే మీరేమన్నారు? నెల ఖర్చులు మీరే పంపించేవారా?
కండక్టర్‌గా చేసింది రెండేళ్లే. రజనీ ఏం చేస్తానంటే దానికి ఓకే అనేవాడిని. మదరాసు వెళతానంటే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఫీజు కట్టాను. ఖర్చుల నిమిత్తం నెలకి రూ.500 పంపించేవాడిని. తన స్నేహితులు కూడా కొంచెం పంపించేవాళ్లు. రజనీకి పట్టుదల ఎక్కువ. పైగా ఇష్టంగా ఎంచుకున్నది కాబట్టి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో క్లాసులకు బాగా వెళ్లి, చివరికి బాలచందర్‌గారి దృష్టిలో పడటం జరిగింది.
► మీ తమ్ముడు సూపర్‌స్టార్ స్థాయికి చేరుకుంటారని ఊహించారా?
చిన్నప్పుడు ఆటల్లోనే ఓటమి లేదని చెప్పాను కదా. పెద్ద స్థాయికి వెళ్లడం ఖాయం అనుకున్నాను. సినిమా అవకాశాలు రావడం, బిజీ అవ్వడం.. అంతా సాఫీగా జరిగినందుకు ఆనందంగా ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి తన కృషి కారణం.
►రజనీగారి స్టైల్ ఆయన్ను మాస్‌కి దగ్గర చేసింది. ఆ నడక వేగం, మాట తీరు ఆకట్టుకున్నాయి. చిన్నప్పుడూ ఇంతేనా?
అసలు స్లోగా నడవడం తనకు అలవాటు లేదు. చిన్నప్పుడూ అంతే. ఫాస్ట్‌గా నడవడం, ఫాస్ట్‌గా మాట్లాడటం. స్టైల్ అనేది తను స్క్రీన్ కోసం అలవాటు చేసుకున్నది కాదు. నేచురల్‌గా వచ్చింది.
► మీ కుటుంబం గురించి? మీకెంత మంది పిల్లలు?
నా భార్య మూడు నెలల క్రితం చనిపోయింది. నాకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. కూతుళ్లిద్దరికీ పెళ్లయింది. కొడుకులు కూడా బాగా సెటిలయ్యారు.
► మీ పిల్లలు సెటిలవ్వడానికి వాళ్ల చిన్నాన్న సహాయం ఎంతవరకూ ఉంది?
నా ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లూ తన చేతుల మీదగానే జరిగాయి. కొడుకులను నేను చదివించుకున్నాను. మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ నా తమ్ముడు సమకూర్చడంతో హ్యాపీగా ఉన్నాం. నేను బెంగళూరు కార్పొరేషన్‌లో సూపర్‌వైజర్‌గా చేసేవాడిని. రిటైర్ అయి పదిహేనేళ్లకుపైనే అయింది. పెన్షన్ వస్తోంది.
► రజనీగారికి పెళ్లయ్యాక ఆయన భార్య లతగారు, మీ ఆవిడ ఎలా ఉండేవారు? మీ కుటుంబాన్ని మీ తమ్ముడు చూసే విషయంలో లతగారికి ఏమైనా ఆక్షేపణ ఉండేదా?
అలా ఏం లేదు. మా మరదలు, మా ఆవిడ ఇద్దరూ బాగుండేవాళ్లు. తమ్ముడు మదరాసులో సెటిలైనా నా కుటుంబంతో నేను బెంగళూరులోనే ఉండిపోయాను. మంచీ చెడుకి కలుసుకుంటాం. కష్టసుఖాలు చెప్పుకుంటాం. మా ఇంటి ఆడవాళ్ల వల్ల మాకెలాంటి మనస్పర్థలు రాలేదు.
► చిన్నప్పుడు ఎంతో ప్రేమగా పెంచిన వదిన మూడు నెలల క్రితం చనిపోయినప్పుడు రజనీగారు వచ్చారా?
వచ్చి, తన వదిన అంతిమ సంస్కారాలన్నీ దగ్గరుండి చేయడం జరిగింది. ఇలా చెప్పొచ్చో లేదో కానీ అలాంటి తమ్ముడు దొరకడం నా పుణ్యం.
► మీ ‘స్టార్ బ్రదర్’కి మీరు ఫోన్ చేయాలంటే.. అందరిలా మేనేజర్ ద్వారానా? డైరెక్ట్‌గా చేస్తారా?
లేదు. డైరెక్ట్‌గానే చేస్తాను. వీలున్నప్పుడల్లా మాట్లాడుకుంటాం. ఆరోగ్యం బాగుందా? పిల్లలందరూ బాగున్నారా? అని రజనీ ఫోన్ చేస్తే, తన క్షేమసమాచారాలు తెలుసుకోవడం కోసం నేను ఫోన్ చేస్తుంటాను.
► మీ తమ్ముడు పెద్ద స్టార్ కాబట్టి ఆయనతో సినిమా నిర్మించి క్యాష్ చేసుకోవాలని మీరు అనుకోలేదా? రజనీగారు మీకా సలహా ఇవ్వలేదా?
నాకు జాబ్ ఉంది కాబట్టి నేనా విషయం గురించి ఆలోచించలేదు. తమ్ముడు కూడా ఎప్పుడూ నాతో ఆ మాట అనలేదు. అయినా తనతో ఎంతోమంది నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. ఒక సినిమా మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మా తమ్ముడి సినిమా చాలామందికి ఉపాధి కల్పిస్తోంది కాబట్టి నాకు ఆనందమే.
► మీ పిల్లల్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనుకోలేదా?
నా రెండో కొడుకు పాండురంగకి సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాల్లోకి రావాలని ఫుణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా చేరాడు. కానీ మా తమ్ముడికి అంతగా ఇష్టం లేదు. సినిమాల్లో ఏదీ శాశ్వతం కాదు.. జాబ్ చేసుకుని హ్యాపీగా ఉంటే బాగుంటుందనడంతో నాకూ అదే మంచిదనిపించింది. ఎందుకంటే ఇక్కడ పేరు రావాలంటే అదృష్టం ఉండాలి. కొంతమంది పేరు తెచ్చుకోగలిగారు. కొంతమంది ఏమీ లేకుండా పోయారు కూడా. అందుకే తమ్ముడి మాటే కరెక్ట్ అనిపించింది. దాంతో మా పాండురంగ కూడా సినిమా ఆలోచన వదులుకున్నాడు.
► రజనీగారి పిల్లలు ఐశ్వర్య, సౌందర్య మీతో ఎలా ఉంటారు? మీ పిల్లలు ఆయనతో?
పెదనాన్న అని నాతో బాగుంటారు. రజనీ పిల్లలు బంగారాలు. నా పిల్లలు కూడా వాళ్ల చిన్నాన్నతో బాగుంటారు.
► మీ అక్కగారికి ఎంతమంది పిల్లలు? వాళ్లను కూడా రజనీగారు బాగా చూసుకుంటారా?
అక్కకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇప్పుడు అక్క లేదు. చనిపోయింది. ఆమె పిల్లలను కూడా రజనీ బాగానే చూసుకోవడంతో వాళ్ల జీవితాలూ బాగున్నాయి.
► రజనీగారు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు బాబాజీ అంటూ హిమాలయాలకు వెళ్లడం లాంటివి చేసినప్పుడు కెరీర్ గురించి మీరేమైనా కంగారుపడ్డారా?
లేదు. ఎందుకంటే చిన్నప్పుడే తనలో ఆధ్యాత్మికం ఉంది. రామకృష్ణ మఠం ప్రభావం తన మీద ఉంది. ఆధ్యాత్మిక బాటలో వెళుతూనే కెరీర్‌ని కూడా సమాంతరంగా తీసుకెళ్లడం తనకు తెలుసు. ఏదో వైరాగ్యం వచ్చినట్లు కుటుంబాన్ని, వృత్తిని వదిలేస్తే అప్పుడు కంగారు పడేవాడిని.
► చిన్నప్పుడు కూడా ఆయనలో ఆధ్యాత్మిక భావాలు ఉండేవన్నారు. గుడికి వెళ్లడంలాంటివి చేసేవారా?
మా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఓ శివుడి గుడి ఉండేది. ఆ పక్కనే రజనీ చదువుకున్న స్కూల్ ఉంది. స్కూల్‌కి వెళ్లేటప్పుడు శివుడి గుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. కండక్టర్ అయిన తర్వాత, హీరో అయ్యాక కూడా రజనీ ఆ గుడిని దర్శించుకున్న సందర్భాలు ఎక్కువే.
► ఆయనతో పాటు హిమాలయాలు రమ్మని మిమ్మల్నెప్పుడూ అడగలేదా?
చాలాసార్లు పిలిస్తే నేనే వెళ్లలేదు. కాలి నడకన 40, 50 కిలోమీటర్లు కొండల్లో వెళ్లాలి. నాక్కొంచెం మోకాళ్ల నొప్పి. అందుకే నా వల్ల కాదన్నాను.
► మీకూ, ఆయనకు వయసు వ్యత్యాసం ఎంత?
దాదాపు పదేళ్లు. నాకు 77 ఏళ్లు.
► రజనీగారి షూటింగ్ లొకేషన్‌కి మీరు వెళతారా?
లేదు. రజనీకి పద్మ విభూషణ్ అవార్డు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. అప్పుడు ‘2.ఓ’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. అందుకని ఆ లొకేషన్‌కి వెళ్లాను. అప్పుడు రజనీకి ఆరోగ్యం అంత బాగాలేదు. ‘2.ఓ’ అంత బాగా వచ్చిందంటే దానికి కారణం డైరెక్టర్ శంకర్. తమ్ముడికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఓపికగా చేయించుకున్నారు.
► మీ తమ్ముడి ఆరోగ్యం విషయంలో మీరు కలవరపడుతుంటారా?
అది ఉంటుంది. అప్పుడప్పుడూ హెల్త్ వైజ్‌గా డౌన్ అయితే ఆ దేవుడ్ని ప్రార్థిస్తుంటాను.. తన ఆరోగ్యం బాగుండాలని. ఎందుకంటే మనకన్నా చిన్నవాళ్లు అనారోగ్యంపాలైతే బాధగా ఉంటుంది. నాకు మోకాలి నొప్పి ఉన్నా ఆరోగ్యపరంగా వేరే సమస్యలు లేవు. అందుకే రజనీ అస్వస్థతకు గురైతే బాధపడిపోతుంటాను. అయినా ఆ మహావతార్ బాబాజీ అనుగ్రహం తన మీద ఉంది. అభిమానుల ప్రార్థనలు ఉంటాయి. అవే చల్లగా కాపాడతాయి.
► రజనీగారి సినిమాలు చూసి బాగుంటే బాగుందని లేదంటే లేదని నిక్కచ్చిగా చెబుతారా?
నా తమ్ముడి సినిమా రిలీజ్ అవ్వగానే సాధ్యమైనంతవరకూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా. బాగుంటే బాగుందని చెబుతాను. బాగా లేకపోతే ఆ విషయం కూడా చెప్పేస్తాను. ‘కాలా’ సినిమాని సరిగ్గా తీయలేదని చెప్పాను. హీరో క్యారెక్టర్‌కి, విలన్ క్యారెక్టర్‌కి మధ్య ఇంకా ఏదో ఉండాలనిపించిందని అన్నాను.
► ఆయన నటించిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైనవి?
ఐదు, పది సినిమాలని లెక్కేసి చెప్పలేను. తమ్ముడు యాక్ట్ చేసే సినిమాలన్నీ ఇష్టమే. తన యాక్టింగ్ చాలా బాగుంటుంది.
► ‘ఈ ఫంక్షన్ నాకు స్పెషల్. ఎందుకంటే మా అన్నయ్య వచ్చారు’ అని ‘2.ఓ’ ఫంక్షన్‌లో రజనీగారు అన్నారు.. ఆయన ఎందుకలా అన్నారు?
నేను సాధారణంగా షూటింగ్ లొకేషన్స్‌కి వెళ్లనని చెప్పాను కదా. సినిమా ఫంక్షన్స్‌కి కూడా వెళ్లను. చెన్నైలో జరిగిన ‘2.ఓ’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కి నన్ను రమ్మని రజనీ పిలిస్తే వెళ్లాను. ఇంటి ఫంక్షన్స్‌కి తప్ప సినిమా ఫంక్షన్స్‌కి వెళ్లను కాబట్టి, తనకు ఆనందంగా ఉండి ఉంటుంది.
►ఫైనల్లీ.. రజనీగారికి రాజకీయాలు సూట్ అవుతాయంటారా?
ఆ విషయం గురించి నేను చెప్పేకన్నా ఆయన చెబితేనే బాగుంటుంది. అయితే ఒక్కటి మాత్రం చెబుతాను. ఇప్పుడు రాజకీయ నాయకుల్లా మాత్రం పరిపాలించే అవకాశం లేదు. తన స్టైల్‌లో ఉంటుంది.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment