![Superstar Rajini Fans Get Married At Petta Movie Releasing Theatre - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/10/petta.jpg.webp?itok=FF18IUY7)
చెన్నై: ఫ్యాన్స్‌నందు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ వేరయా..! అనే విశేషం గురువారం ‘పేట’ సినిమా విడుదల సందర్భంగా చోటుచేసుకుంది. రజనీ సినిమా రిలీజ్ అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆయన తమ అభిమాన సినీనటుడు మాత్రమే కాదు.. ‘అంతకు మించి’ అని నిరూపించారు ఓ జంట. అంబసు, కమాచి అనే యువతీ యువకులు ‘పేట’ సినిమా విడుదల సమయాన్నే అద్భుత ముహూర్తంగా ఖరారు చేసుకున్నారు. సినిమా విడుదల సమయానికే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ రజనీ వీరాభిమానులే కావడం మరో విశేషం.
అలాగని ఈ పెళ్లి ఏ ఫంక్షన్ హాల్లోనో, గుడిలోనో జరగలేదు. ‘పేట’ సినిమా రిలీజ్ అయిన ఉడ్‌లాండ్స్ సినిమా హాల్ వద్దే జరిగింది. అక్కడే వివాహ వేదికను ఏర్పాటు చేసుకుని, ఈ జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. రజనీ నటించిన సినిమా పోస్టర్లతో ఏర్పాటు చేసిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లికి రజనీ అభిమానులందరూ ఆహ్వానితులే. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులందరూ ఈ పెళ్లి చూసి హర్షం వ్యక్తం చేశారు. అక్షితలు వేసి దీవెనలు అందించారు. వివాహం అనంతరం అభిమానులకు భోజన ఏర్పాట్లు కూడా చేశారు. సూపర్‌స్టార్‌పై తమ అభిమానాన్ని అంబసు, కమాచి ఇలా చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment