తమిళసినిమా: సినిమా నుంచి నెక్ట్స్ ఏంటీ? అంటే ఇంకేముంది రాజకీయమే అన్నట్టుగా తారల ఆలోచనలు ఉంటున్నాయని ఢంకా పదంగా చెప్పవచ్చు. అలా సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన తారలు చాలా మంది రాజకీయాల్లో రాణించారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ద్రావిడ రాష్ట్రాన్ని పాలించిన వారిలో 90 శాతం మంది సినిమా వాళ్లే అన్నది నిర్విదాంశం. నాటి అన్నాదురై నుంచి, ఇటీవల జయలలిత వరకూ తమిళనాడులో అధికారం చేపట్టి ప్రజాదరణను పొందారు.
తాజాగా కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్ నటుడు అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వీరే కాదు వివిధ రాజకీయ పార్టీల్లో చేసి అధికార ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఇక నటీమణుల విషయానికి వస్తే రాధిక శరత్‌కుమార్, కుష్బూ, నగ్మా లాంటి వారు రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. వీరంతా ఇంతకు ముందు సినిమా రంగంలో ఏలిన వారే. పలు చిత్రాల్లో కలెక్టర్లు, శాసనసభ్యులు, మంత్రులు లాంటి పాత్రలు పోషించి, మెప్పించి ఆ ఆదరణ, ఆకర్షణతో రాజకీయాల్లోకి వచ్చారన్నది ప్రత్యేకంగా చెప్పనవరసరం లేదు.
ఇప్పుడు అదే కోవలో లేడీసూపర్‌స్టార్‌గా కోలీవుడ్‌ను ఏలేస్తున్న నయనతార పయనించే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి ఆమెకు అలాంటి ఆలోచన లేకున్నా, మందిమాగాదులు ఆలాంటి పరిస్థితికి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడం మొదలెట్టిన ఈ కేరళ బ్యూటీ వరుసగా ఆ తరహా చిత్రాలను కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తను నటించిన అరమ్ చిత్రం నయనతారను రాజకీయ చర్చల్లోకి లాగేసింది.ఆ చిత్రంలో నిజాయితీకలిగిన కలెక్టర్‌గా నటించిన నయనతార ఒక దశలో స్వార్ధం, అవినీతితో కూరుకుపోయిన నాయకులతో ఇమడలేక ఆ పదవికి రాజీనామా చేసిన ప్రజాసేవే లక్ష్యంగా జనాల్లోకి వచ్చేస్తారు.
ఇలాంటి సమాజానికి కావలసిన పలు అంశాలతో కూడిన అరమ్ చిత్రం ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను రాబట్టుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ చిత్ర నిర్మాత అరమ్ 2 చిత్రాన్ని రెడీ అంటున్నారు. నయనతార కూడా అందుక పచ్చజెండా ఊపినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే అరమ్ చిత్ర రెండవ భాగం మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందనే టాక్ వైరల్ అవుతోంది.అందులో ప్రజల్లోకి వెళ్లి శాసనసభ్యురాలు, ముఖ్యమంత్రి వరకూ పదవులను చేపట్టే విధంగా కథను దర్శకుడు గోపీనయినార్ రెడీ చేస్తున్నారట. ఆ చిత్రం తరువాత నయనతారను నెక్టŠస్ ఏంటీ? అన్న ప్రశ్నకు రాజకీయమే అనే బదులు వచ్చినా ఆశ్యర్యపడనవసరం లేదనే ప్రచారం స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇవిన్నీ ఊహాగానాలే. నిజం ఏమిటన్నది నయనతార స్పందిస్తేగానీ తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment