
ఆ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది
ఆ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందంటున్నారు నటుడు శింబు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్.
ఆ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందంటున్నారు నటుడు శింబు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.అందులో ఒకటి వయసు మళ్లిన పాత్ర కాగా మరో రెండు యువ పాత్రలని ప్రచారం జరుగుతోంది.ఆయనకు జంటగా నటి తమన్నా, శ్రియ నటిస్తున్నారు.వయసు మళ్లిన పాత్రకు జంటగా శ్రియ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ పాత్రతో నటి తమన్నా ఉన్న ఫొటోలే విడుదలవ్వడం గమనార్హం.
ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గ్లోబల్ ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై నిర్మాత మైఖెల్ రాయప్పన్ నిర్మిస్తున్న అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై విశేష ఆదరణను పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శింబు స్పందిస్తూ ఈ చిత్రంలో తాను మూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నానన్నారు.అందుకే అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ అనే టైటిల్ కరెక్ట్‌గా ఉంటుందని భావించి ఆ పేరును నిర్ణయించినట్లు తెలిపారు. టీజర్ చూసి ఈ చిత్రం ఇలా ఉంటుందని ఊహించరాదన్నారు.
తాము ఒక వైవిధ్య కథతో చేస్తున్న చిత్రం ఇదని తెలిపారు.ఇంకా చెప్పాలంటే ఒక ప్రయోగం చేస్తున్నామని చెప్పవచ్చునన్నారు. అయితే ఇందులో తనవి మూడు పాత్రలు కాదని, నాలుగు పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయం గురించి తాను చెప్పినందుకు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ కోపగించుకోవచ్చునని, ఇది సరైన సమయంగా భావించి నాలుగో పాత్ర గురించి వెల్ల డించానని అన్నారు. ఈ పాత్ర చిత్రంలో సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెప్పారు.