
సాక్షి, కర్ణాటక, బళ్లారి: భారీ బడ్జెట్‌తో ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్‌కు కర్ణాటకలోని బీదర్‌లో చుక్కెదురైంది. ఈ చిత్రంలో అమితాబచ్చన్‌తో పాటు కన్నడ ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం రాత్రి బీదర్‌లోని చారిత్రక బహుమని సుల్తానుల కోటలో కిచ్చ సుదీప్‌పై సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధమయ్యారు. ఇందుకు ధార్వాడ కమిషనర్‌తో అనుమతి పొందారు.
భారీఎత్తున సిబ్బంది, కెమెరాలతో అక్కడ సందడి నెలకొంది. సుదీప్ అక్కడికి చేరుకున్న వెంటనే పెద్దసంఖ్యలో ముస్లిం యువత వచ్చి.. ఇక్కడ షూటింగ్ చేయకూడదని, తమ మనోభావాలకు దెబ్బతింటాయని అడ్డుకున్నారు. దాదాపు 100 మందికి పైగా యువత చేరుకోగా, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుదీప్‌పై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. సుల్తాన్‌కోటపై హిందువులకు సంబంధించిన విగ్రహాలను ఉంచి షూటింగ్ జరపడం తగదని వాదించారు. సినీ నిర్మాతతో పాటు పలువురు అక్కడకు చేరుకుని తాము ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా షూటింగ్ జరపబోమని నచ్చజెప్పి షూటింగ్‌ను విరమించారు. అవాంఛనీయాలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.