
సాక్షి, ముంబై: ఒకవైపు సీరియస్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు కామెడీ రోల్స్‌లతో ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నట్టు నటి తాప్సీ తెలిపింది. ఆమె ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ ‘దిల్ జంగ్లీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా బుధవారం విలేకరులతో మాట్లాడింది. సీరియస్ సినిమాలను పక్కనబెట్టి.. కమర్షియల్ సినిమాలు, కామెడీ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అని ప్రశ్నించగా.. ‘అదేమీ లేదు. జుడ్వా-2 తర్వాత నేను చేస్తున్న లైట్‌హార్ట్‌డ్ సినిమా ఇది.
ఈ సినిమా తర్వాత నేను మళ్లీ పవర్‌ఫుల్ పర్ఫాన్మెన్స్ జోన్‌లోకి వెళ్లిపోతాను. ’పింక్’ సినిమా తర్వాత ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నాను. ఏదైనా మళ్లీమళ్లీ చేయడం నాకు నచ్చదు. ఇది (దిల్ జంగ్లీ) కామెడీ సినిమానే అయినా ఇందులో నా పాత్ర, సినిమా కథ.. ప్రతిదీ భిన్నంగా ఉంటుంది’ అని తాప్సీ వివరించింది. ఇక, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగితే.. ఇప్పుట్లో ఆ ఆలోచన లేదని తెలిపింది. ‘నేను ఎక్కడికో వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకోను. ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఆ విషయాన్ని మీడియాకు చెప్తాను. ఇందులో దాచేందుకు ఏముంది’ అని తాప్సీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment