పెళ్లయితే రొమాన్స్ చేయకూడదా!?
‘‘కథానాయికలకు ముప్ఫయ్, నలభై ఏళ్లు వస్తే చాలు... పరిణతి చెందిన పాత్రలే ఇస్తారు. అక్క, వదిన పాత్రలకు పరిమితం చేసేస్తారు. అదే హాలీవుడ్‌లో అయితే ఎంచక్కా రొమాంటిక్ సినిమాలకు కూడా అవకాశం ఇస్తారు’’ అని తాప్సీ అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో కథానాయికల కెరీర్ దీర్ఘకాలం ఉండదు కదా? అనే ప్రశ్న తాప్సీ ముందుంచితే -‘‘మన భారతీయ సినిమాల్లో ఉన్న మైనస్ అదేనండి. పెళ్లయితే చాలు కథానాయికగా పనికి రారని ఫిక్స్ అయిపోతారు.
పెళ్లయినవాళ్లు రొమాంటిక్ సీన్స్‌కి బాగుండరని కూడా అనుకుంటారు. పెళ్లయినంత మాత్రాన రొమాన్స్ చేయకూడదా!? ఒకవేళ పెళ్లయిన తారలు ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడకపోతే అది వాళ్ల సొంత నిర్ణయం. దాన్ని నేను గౌరవిస్తాను. కానీ, ఎలాంటి ఆక్షేపణ లేకుండా నటించడానికి సుముఖంగా ఉన్న తారలను పక్కన పెట్టాలనుకోవడం ఏంటి? పెళ్ల యినంత మాత్రాన ప్రతిభ తగ్గిపోతుందా?’’ అన్నారు ఆవేశంగా.
ఇంతకీ పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఇదే రంగంలోనే ఉండాలనుకుంటున్నారా? అనడిగితే -‘‘చివరి శ్వాస వరకూ నా జీవితం సినిమా రంగంలోనే అని నేను చెప్పను. ఒకానొక దశలో నేను నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తా. పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలనుకుంటున్నా. కానీ, సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోవాలనుకోవడంలేదు. ఎందుకంటే, సినిమా వాతావరణానికి భిన్నమైన జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా’’ అని తాప్సీ స్పష్టం చేశారు.