రంగవల్లుల కేళి మా దీపావళి!
రంగులు ఎంపిక చేయడం.. ఇంటి ముందు ఏయే ముగ్గులు వేయాలో నిర్ణయించడం.. చిన్నప్పుడు దీపావళి వస్తే ఈ పనులతోనే సరిపోయేది. వేసిన ముగ్గు ఎంత చెత్తగా ఉన్నా ఏదో గొప్ప పని చేశామన్న ఫీలింగ్... రంగులన్నీ కలిపి ముగ్గులు వేయడం భలే సరదాగా ఉండేది! నాకప్పుడు దీపావళి అంటే ముగ్గుల కేళీనే. దీపాలకు రంగులు వేసి ఇల్లంతా అలకరించేదాన్ని. ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలసి సాయంత్రం ముంబైలోని మహాలక్ష్మీ అమ్మవారి గుడికి వెళతాం.
ఎన్నో దీపావళులను ఈ విధంగానే జరుపుకున్నా. ప్రతి దీపావళికీ నేను ఇంట్లోనే ఉంటాను. ఈ పండక్కి ఎవరూ షూటింగ్‌లు చేయరు. దాంతో హీరోయిన్ అయిన తర్వాత కూడా ప్రతి దీపావళి ఇంట్లోనే జరుపుకున్నా. చాలా ఏళ్ల క్రితమే టపాసులు కాల్చడం మానేశాను. చిన్నప్పుడు కూడా పెద్దగా కాల్చిన సందర్భాలు లేవు. టపాసుల వలన పొల్యూషన్ మాత్రమే కాదు, ఊరంతా చెత్త పేరుకుపోతుంది. అది నాకిష్టం లేదు.
షుగర్ ఫ్రీ స్వీట్స్!
స్వీట్స్ మన పండగల్లో ఎప్పుడో ఓ భాగమయ్యాయి. ప్రతి పూజకూ స్వీట్స్ కంపల్సరీ కదా. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ, అవగాహన ఎక్కువ య్యాయి. మా ఇంట్లో తయారు చేసే స్వీట్స్ అన్నీ షుగర్ ఫ్రీనే. సాధారణంగా నేను ఎక్కువ స్వీట్స్ తినను. కానీ, పండగలప్పుడు నా డైట్ పక్కన పెట్టేసి స్వీట్స్ తినేస్తాను.