వర్మ సినిమా ఆడియా ఫంక్షన్ కు రోశయ్య
నాందాండ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ రోశయ్యను నిర్మాత దేవిశ్రీదేవి సతీష్ ఆహ్వానించారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం నాందాండ. హిందీలో వచ్చిన సత్య సినిమాకు ఇది సీక్వెల్. హిందీ, తెలుగు, తమిళ భాషాల్లో ఇది తెరకెక్కుతోంది. తమిళ వెర్షన్ ను సతీష్ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై దేవిశ్రీదేవి సతీష్ నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ముంబయి ముద్దుగుమ్మలు అనైక, అనీషా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో సురేష్, తలైవాస్ విజయ్ కనిపించనున్నారు.
కథేంటి
రామ్‌గోపాల్ వర్మ చిత్రాలు ఇలా ఉంటాయని ఊహించడం కష్టం. ఆయన దర్శకశైలి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే వైవిధ్యభరిత కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో వర్మది అందెవేసిన చేయి. అలాంటి దర్శకుడు ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రం నాందాండా అని నిర్మాత సతీష్ పేర్కొన్నారు. ఆయన చిత్రీకరణ ఎంత వేగంగా ఉంటుందో అంత అద్భుతం గా ఉంటుందని తెలిపారు. రౌడీలకు రౌడీగా మారితే జరిగే పరిణామాలేమిటన్నది నాందాండా చిత్ర కథ అని చెప్పారు.
శరవేగంగా నిర్మాణం
చిత్ర నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని సతీష్ వెల్లడించారు. చిత్ర షూటింగ్ తుది షెడ్యూల్ ఈ నెల 13 నుంచి చెన్నైలో జరగనుందని తెలిపారు. మరోపక్క డబ్బింగ్, ఎడిటింగ్, రీరికార్డింగ్, స్పెషల్ ఎఫెక్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఈ నెలలోనే ఆడియో
ఈ నెలలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ రోశయ్యను ఆహ్వానించినట్లు వెల్లడించారు. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు యత్నిస్తున్నామన్నారు.
ట్రైలర్‌కు కలైపులి థాను వాయిస్ ఓవర్
నాందాండ ఉత్తర చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న చిత్రమని సతీష్ వివరించారు. చిత్ర సంభాషణలు ఆ ప్రాంత యాసలోనే ఉంటాయని చెప్పారు. చిత్ర ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ నేటివిటీకి తగ్గట్టుగా ఉంటే బాగుంటుందని భావించానన్నారు. అందువలనే ఉత్తర మద్రాసులో పుట్టిన పెరిగిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థానుతో ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ చెప్పించామని తెలిపారు. ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్.థాను తొలిసారిగా వాయిస్ ఓవర్ ఇస్తున్న చిత్రం నాందాండా కావడం విశేషం.