
తనుశ్రీ దత్తా
తనలాంటి మరింత మంది బాధితులను బయటకు రాకుండా భయపెట్టడానికే..
ముంబై : గత కొన్ని రోజులుగా తనుశ్రీ దత్తా - నానా పటేకర్‌ల వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఈ ఆరోపణలు హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనుశ్రీ చేసే ఆరోపణలు అసత్యమైనవని, క్షమాపణలు చెప్పాలని ఆమెకు నోటీసులు పంపామని పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ మీడియాకు తెలిపారు.
తనుశ్రీ మాత్రం తనకు నానాపటేకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. ఈ నోటీసులు బెదిరింపులు.. తనలాంటి మరింత మంది బాధితులను బయటకు రాకుండా భయపెట్టడానికేనన్నారు. ఎవరికైనా తనలాంటి అనుభవమే ఎదురైతే ధైర్యంగా బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటివాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశం మొత్తం మద్దతినిస్తుందని తెలిపారు.
ఇక తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు, నటీమణులు ఒక్కొక్కరూ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. మరోవైపు తనుశ్రీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతూ వస్తోంది. సెట్స్‌లో జరిగిన వాటిపై తనుశ్రీ చెబుతున్న విషయాలకు సంబంధించి, ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఆ వీడియోలో ఉండటం, ఆమె ఆరోపణలు వాస్తమేనని తేలుతోంది.