నవ్వుల కొలనులో విరిసిన కామెడీ కమలం సుత్తివేలు | telugu comedian actor Suttivelu | Sakshi
Sakshi News home page

నవ్వుల కొలనులో విరిసిన కామెడీ కమలం సుత్తివేలు

Published Wed, Aug 7 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

నవ్వుల కొలనులో విరిసిన కామెడీ కమలం సుత్తివేలు

నవ్వుల కొలనులో విరిసిన కామెడీ కమలం సుత్తివేలు

‘తెలుగు సినిమా హాస్యం’ అనే పుస్తకం రాస్తే... అందులో సుత్తివేలుకి ఓ ప్రత్యేక అధ్యాయం కేటాయించాల్సిందే. దాదాపు దశాబ్దం పాటు హాస్యనటునిగా తెలుగుతెరపై తిరుగులేని ప్రస్థానం సుత్తివేలుది. స్పష్టంగా మాట్లాటడం, స్వచ్ఛమైన హాస్యాన్నిపంచడం ఆయన ప్రత్యేకత. అందుకే.. హాస్యప్రియులైన ప్రేక్షకులందరూ ఆయన సుత్తిని స్తుతించారు. తెలుగు సినిమా నవ్వుల కొలనులో విరిసన ఈ కామెడీ కమలం జయంతి నేడు. అందుకే కాసేపు సుత్తివేలు గురించి...
 
 *** మన దేశానికి ఇంకో ఎనిమిది రోజుల్లో స్వాతంత్య్రం వస్తుంది అనగా... కృష్ణాజిల్లా భోగిరెడ్డిపల్లిలో జన్మించారు సుత్తివేలు అలియాస్ కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు. 
 
 *** చిన్నతనం నుంచీ సుత్తివేలుకు నటన అంటే ప్రాణం. ఉపాధ్యాయుడైన తన తండ్రికి నచ్చకపోయినా... తాను మాత్రం ఏడేళ్ల వయసు నుంచే నటించేయడం మొదలుపెట్టేశారు. అలా పసి వయసులోనే రంగస్థలం ఆయనకు నటనలో ఓనమాలు నేర్పింది. వైజాగ్ సత్యానంద్ ట్రూప్‌తో కలిసి అప్పట్లో చాలా నాటకాలు ఆడారు సుత్తివేలు.
 
 *** ‘ముద్దమందారం’ చిత్రీకరణ పనిమీద వైజాగ్ వచ్చిన జంధ్యాల... సోమంచి యజ్ఞన్న శాస్త్రి రచించిన ‘మనిషి నూతిలో పడితే’ నాటకం చూడ్డం జరిగింది. సత్యానంద్ ట్రూప్ ఆడిన ఆ నాటకంలో... సుత్తివేలు జంధ్యాలకి ప్రత్యేకంగా కనిపించారు. దాంతో అప్పటికప్పుడే... ‘నిన్ను నటునిగా పరిచయం చేస్తా’ అని హామీ ఇచ్చారు జంధ్యాల. మాట తప్పకుండా ‘ముద్దమందారం’(1982) చిత్రంలో ఓ చిన్న పాత్ర ఇచ్చారు. 
 
 *** కానీ సుత్తివేలు జీవితంలో మేలి మలుపుగా చెప్పుకోవాల్సిన సినిమా మాత్రం ‘నాలుగు స్థంభాలాట’(1982). సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు జంట ‘సుత్తిజంట’గా ప్రఖ్యాతి గాంచింది ఆ సినిమాతోనే. కురమద్దాలి లక్ష్మీనరసిహారావు కాస్తా.. ఆ సినిమాతో సుత్తివేలుగా మారిపోయారు. ఇక అక్కడ్నుంచీ ఆయనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 
 
 *** పుత్తడిబొమ్మ, ఖైదీ, శ్రీవారికి ప్రేమలేఖ, బాబాయ్ అబ్బాయ్, ఆనందభైరవి, రెండు రెళ్లు ఆరు, చంటబ్బాయ్, దొంగమొగుడు... ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో శతదినోత్సవ చిత్రాలు సుత్తి కెరీర్‌లో. 
 
 *** జంధ్యాల, రేలంగి నరసింహారావు వంటి దర్శకులు తెరకెక్కించిన హాస్య చిత్రాలతో పాటు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కోడిరామకృష్ణ, ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, కె.మురళీమోహనరావు, ఎస్.ఎస్.రవిచంద్ర, మోహనగాంధీ లాంటి దర్శకులు  తెరకెక్కించే యాక్షన్ చిత్రాల్లో కూడా కాసేపు సుత్తి కామెడీ ఉండాల్సిందే.
 
 *** సుత్తివేలులోని మరో కోణాన్ని చూపించిన దర్శకుడు టి.కృష్ణ.  వందేమాతరం, రేపటి పౌరులు, దేవాలయం చిత్రాలతో సుత్తివేలులోని విలన్ యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపించారాయన.
 
 *** కొన్ని పాత్రలు నటుడికి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. కానీ ఆ పాత్రలే సదరు నటుడికి శాపంగా కూడా పరిణమిల్లుతాయి. ‘ప్రతిఘటన’ చిత్రంలో వేలు పోషించిన కానిస్టేబుల్ శ్రీశైలం పాత్ర అలాంటిదే. హాస్య నటునిగా ఎదురులేని ప్రస్థానం సాగిస్తున్న సుత్తివేలు కెరీర్‌ని సమూలంగా మార్చేసిందా పాత్ర. రాజకీయం, గూండాయిజం వల్ల సర్వాన్నీ కోల్పోయి... చివరికి పిచ్చివాడిగా మిగిలిపోయిన విప్లవకారుడు కానిస్టేబుల్ శ్రీశైలం పాత్రలో సుత్తివేలు అనితరసాధ్యమైన నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ అప్పట్నుంచీ.. ఆయనకు ఎక్కువశాతం సీరియస్ పాత్రలే రావడం మొదలైంది. ఆడపాదడపా కామెడీ పాత్రలు చేసినా అవేమీ ఆయనకు పెద్దగా పేరు తీసుకురాలేదు. కలికాలం, నవభారతం, డబ్బెవడికి చేదు.. లాంటి సీరియస్ పాత్రలతోనే ఆయన సరిపెట్టుకున్నారు. 
 
 *** పోనూ పోనూ ఆడపిల్ల తండ్రి పాత్రలే ఆయన్ను ఎక్కువగా వరించాయి. దాంతోపాటు హాస్యనటునిగా బ్రహ్మానందం ప్రాభవం మొదలవ్వడం, తెలుగు సినిమా హాస్యంలో కొత్త పోకడలు సంభవించడం, కొత్త కొత్త కమెడియన్స్ తెరంగేట్రం... ఇత్యాది కారణాల వల్ల వేలు ప్రభావం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 
 
 *** జేడీ చక్రవర్తి దర్శకత్వం వహించిన ‘ఆల్ ది బెస్ట్’ సుత్తివేలు చివరి సినిమా. 2012 సెప్టెంబర్ 16న సుత్తివేలు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. నేడు సుత్తివేలు పుట్టిన రోజు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా... ఆయన పంచిన నవ్వులు మనల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement