వీకెండ్ రిలేషన్‌షిప్స్ మొదలయ్యాయి!
‘‘ఏడేళ్లు ప్రేమించి, పెళ్లి చేసుకుని ఏడు రోజుల్లో విడిపోయే భార్యాభర్తలు నాకు తెలుసు. అలాగే, నిశ్చితార్థం జరిగి, పెళ్లి వరకూ వెళ్లకుండా విడిపోయినవాళ్లూ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ‘పర్సనల్ స్పేస్’ ఏర్పరచుకుంటున్నారు. అందుకని సర్దుకుపోలేక విడిపోతున్నారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఆయన దర్శకత్వంలో నందు, ఐనైకా సోటి జంటగా నటించిన చిత్రం ‘365 డేస్’. డి.వి క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మీడియాతో చెప్పిన ముచ్చట్లు...
పెళ్లితో ఇద్దరు వ్యక్తులు ఎక్కువ కాలం కలిసి ఉండలేరని నా అభిప్రాయం. అందుకే ఈ చిత్రానికి ‘365 డేస్’ అని టైటిల్ పెట్టా. నా దృష్టిలో ఇంకొన్ని రోజులయ్యాక పెళ్లిళ్లు ఉండవేమో. ‘లివ్ ఇన్ రిలేషన్ షిప్స్’ తరహాలో ఇప్పటికే విదేశాల్లో ‘వీకెండ్ రిలేషన్ షిప్స్’ మొదలయ్యాయి. ప్రస్తుతం నాదైతే ‘అవర్లీ బేసిస్’ (నవ్వుతూ).
ఈ చిత్రంలో నా వైవాహిక జీవితానికి సంబంధించిన 60 శాతం విషయాలను ప్రస్తావించాను. ఇప్పటివరకూ ఏ చిత్రంలోనూ చూపించలేదు. గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లయ్యాక వారి మధ్య చెలరేగిన భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను.
ఓ భార్యా భర్త విడిపోయారంటే ఎవర్నీ నిందించలేం. ఎవరి దృష్టి కోణంలో వారు కరెక్ట్. నా వైవాహిక జీవితం విషయంలో నా భార్య నిర్ణయం సరైనది అయ్యుండొచ్చు. అలాగని నా నిర్ణయం తప్పని నేనను.
మ అమ్మాయి రేవతి నన్నో జూలో జంతువును చూసినట్లుగా చూస్తుంది. తన మ్యారీడ్ లైఫ్ నాకు బోరింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్లిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ, ఎప్పుడూ గొడవపడితేనే బాగుంటుంది. ఐదేళ్ల తర్వాత ఏం చేయాలి? ఎలా ఉండాలి? అని కూడా వాళ్లు ప్లాన్ చేసుకుంటారు. కానీ, తర్వాతి నిమిషంలో ఏం చేయాలో కూడా నేను ప్లాన్ చేయను.