
అందుకే రజనీకి విలన్‌గా నటించలేదు!
‘రోబో’ సీక్వెల్ ‘2.0’లో రజనీకాంత్ హీరో... కమల్‌హాసన్ విలన్. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు దర్శకుడు శంకర్ ఈ విధంగానే అనుకున్నారు. ఈ కాంబినేషన్ అయితే ఈ సీక్వెల్‌కు భారీతనం వస్తుందనీ, భారీ అంచనాలు ఏర్పడతాయనీ, నిర్మాణ వ్యయం ఎక్కువైనా ఫర్వాలేదని శంకర్ అనుకున్నారు. సీక్వెల్లో హీరోగా నటించడానికి రజనీ ఓకే చెప్పారు కానీ, కమల్ మాత్రం ‘నో’ అనేశారు. ఆ తర్వాత శంకర్ ఈ చిత్రంలో విలన్‌గా అక్షయ్‌కుమార్‌ని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. కమల్ ఈ సీక్వెల్‌కు నో చెప్పడానికి బలమైన కారణమే ఉందట.
దర్శక దిగ్గజం బాలచందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చేసిన తర్వాత కమల్, రజనీలు పలు చిత్రాల్లో కలిసి నటించారు. కానీ, స్టార్‌డమ్ వచ్చాక మాత్రం కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నారట. దీనికి ఓ రహస్య ఒప్పందం చేసుకున్నామని కమల్‌హాసన్ చెప్పారు. ‘‘ ‘2.0’లో విలన్ రోల్ కాబట్టి నేను కాదనలేదు. అలాంటి పాత్రలు నేనెన్నో చేశాను. కాకపోతే రజనీ, నేను కలిస్తే మా మార్కెట్‌కి తగ్గ పారితోషికం ఇవ్వాలి. మాకంత ఇస్తే.. ఇక సినిమా నిర్మించడానికి డబ్బులెక్కడుంటాయ్? అందుకే నో చెప్పా’’ అని అసలు కారణం బయటపెట్టారు కమల్.
ఫ్యాన్స్ మళ్లీ తమ కాంబినేషన్‌ని కోరుకుంటే.. ఫుల్ మూవీయే చేయనవసరంలేదనీ, అతిథి పాత్రలైనా చేయొచ్చనీ, అందుకు తాను రెడీ అని కమల్ పేర్కొన్నారు. ఫ్యాన్స్ కోసం ఇద్దరూ కలిసి ఫుల్ సినిమా చేస్తే, అప్పుడు పారితోషికం తగ్గించుకోవాల్సి వస్తుందనీ, అలా ఎందుకు చేయాలని కమల్ ప్రశ్నించారు. పాయింటే కదా...!