
సేవ్ తమిళ సినిమా
‘సేవ్ తమిళ సినిమా’ అంటున్నారు చెన్నై సినీ జనాలు! సినిమాలపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ విధించగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వినోదపు పన్ను విధిస్తోంది. అంటే... మొత్తం వసూళ్లలో 58 శాతాన్ని పన్నుల రూపంలో చెల్లించాలన్నమాట. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సినిమా థియేటర్ల యజమానులు బంద్ ప్రకటించారు.
సోమవారం తమిళనాడులో సుమారు 1100 థియేటర్ల తలుపులు తెరుచుకోలేదు. పన్ను తగ్గించేవరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఈ బంద్‌కు మద్దతుగా తమిళ చిత్రసీమ గళం విప్పింది. తాజా పరిస్థితులపై తమిళనాడు సినిమాటోగ్రఫీ మంత్రి కడంబూర్ రాజుతో సమావేశమైన నటుడు, తమిళ సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పన్ను తగ్గించాలని కోరారు. నటుడు, దర్శక–నిర్మాత కమల్‌హాసన్ ‘‘ఇండస్ట్రీ అంతా ఒక్కటై... ఒక్క వాయిస్‌ను వినిపిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘48 నుంచి 58 శాతం ట్యాక్స్ అంటే టూమచ్. సేవ్ తమిళ సినిమా’’ అని ప్రముఖ దర్శకుడు శంకర్ ట్వీట్ చేశారు.
ఇదే అభిప్రాయాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వ్యక్తం చేశారు. ‘‘పది లక్షల కుటుంబాలతో పాటు తమిళ సినిమాపై ఆధారపడిన వ్యక్తులను జీఎస్టీ ఛిద్రం చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇట్స్ టైమ్ టు స్పీక్ ఆర్ నెవర్’’ అన్నారు సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్. ‘‘థియేటర్లు మూత పడడం ఎంతో బాధగా ఉంది. పన్నులను సరిచేస్తారని, ఇండస్ట్రీ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందని ఆశిస్తున్నాను. అప్పటి వరకు నా రెమ్యునరేషన్‌లో 15 శాతం తగ్గించుకుంటా’’ అని రచయిత, ‘బాహుబలి’లో కిలికిలి భాష సృష్టికర్త మదన్ కార్కీ పేర్కొన్నారు. వీళ్లతోపాటు పలువురు తమిళ సినిమా తారలు ‘సేవ్ తమిళ సినిమా’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.