
పార్టీలో ఆ ముగ్గురు!
తమిళసినిమా: పార్టీలో చేరడానికి ముగ్గురు బ్యూటీస్ రెడీ అవుతున్నారు. ఏమిటీ ఏదేదో ఊహించుకుంటున్నారా? అంతలేదిక్కడ. సాధారణంగా వెంకట్‌ప్రభు చిత్రాల్లో హీరోలు, హీరోయిన్లు ఒకటి కంటే ఎక్కువే ఉంటారు. చెన్నై–28 చిత్రంలో చాలా మంది హీరో లు నటించారు. ఇక మంగాత్తాలో అజిత్‌తో పాటు అర్జున్, త్రిష, ఆండ్రియా అంటూ ప్రముఖ తారలు నటించారు.
ఇటీవల వచ్చిన చెన్నై 28–2లోనూ హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇవన్నీ మంచి విజయాన్ని సాధించిన చిత్రాలే అన్నది గమనార్హం. కాగా వెంకట్‌ప్రభు తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి పార్టీ అనే టైటిల్ నిర్ణయించారు. దీన్ని అమ్మాక్రియేషన్స్ పతాకంపై టి.శివ నిర్మించనున్నారు. ఇందులో సత్యరాజ్, నాజర్, జయరాం, రమ్యకృష్ణ, జై, శివ, సంపత్, కయల్‌చంద్రన్ అంటూ చాలా మంది నటులు నటించనున్నారు.
కాగా ఈ పార్టీలో నటి రెజీనా, సంచితాశెట్టి, నివేదపెతురాజ్ ముగ్గురు ముద్దుగుమ్మలు నటించనున్నారు. దీంతో పార్టీ చిత్రంపై ఆసక్తి పేరుగుతోంది. మరి ఈ ముద్దుగుమ్మలు పార్టీలో ఎలాంటి మజా అందిస్తారో చూడాల్సిందే. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందించనున్నారు. చిత్ర షూటింగ్‌ను బీజీ దీవుల్లో ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి చిత్ర వర్గాలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట. మొత్తం మీద వెంకట్‌ప్రభు ఈ పార్టీతో మరో విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట.