
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకి చెందిన పాటల రికార్డింగ్ స్టూడియోలో చోరీ జరిగింది. ఫిలింనగర్ రోడ్ నంబర్ 10లోని ప్లాట్ నంబర్ సి.45లో ఉన్న స్టూడియోలో దాచిన రూ.4.5 లక్షలు అపహరణకు గురయ్యాయి. జనవరి 27న చెన్నై వెళ్లిన ఆయన ఈ నెల 2న తిరిగి వచ్చారు. అవసరం నిమిత్తం శనివారం బీరువా తెరిచి చూడగా అందులోని నగదు కనిపించలేదు.
దీంతో మణిశర్మ వ్యక్తిగత సహాయకుడు వెంకటేశ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన మేనేజర్ జి.సుబ్బానాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.