ఆ ఏజిలో నేను కొంచెం తింగరిదాన్ని
చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి అమ్మా నాన్న చెబుతుంటే వినడానికి తమాషాగా ఉంటుంది. టీనేజ్‌లో చేసిన హంగామా ఎప్పటికీ మురిపెంగా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో చేసిన పనులు 30 ఏళ్ల వయసులో సిల్లీగా అనిపిస్తాయి. ఇటీవల ఓ సందర్భంలో కాజల్ అగర్వాల్ తన ట్వంటీస్ గురించి గుర్తు చేసుకున్నారు.
ఆ జ్ఞాపకాల గురించి చెబుతూ - ‘‘ట్వంటీ ఇయర్స్ ఏజ్‌లో నేను కొంచెం తింగరదానిలా ఉండేదాన్ని. అప్పట్లో నేను చేసినవన్నీ పిచ్చి పనులే. మానసిక పరిపక్వత లేని ఆ పనులను మా అమ్మ ఎలా తట్టుకుందో అనిపిస్తోంది. అమ్మ గెడైన్స్ వల్లే మెల్లిగా నాలో మార్పొచ్చింది. ఇప్పుడు తెలివిగా ఆలోచించగలుగుతున్నాను. వయసు పెరిగే కొద్దీ సహజంగా మానసిక పరిణతి కూడా వస్తుంది కాబట్టి, ఇప్పుడు నేను తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను.
అంతకు ముందు ప్రతిదానికీ ‘డాడీ’ అంటూ మా నాన్న చుట్టూ తిరిగేదాన్ని. ఇప్పుడు నా పనులన్నింటినీ నేనే చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నాకు తెలివితేటలున్నాయి. డబ్బుంది. సమర్థవంతంగా బతికే తెలివితేటలున్నాయి. అన్నింటికీ మించి అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకునేంత పరిణతి వచ్చేసింది’’ అన్నారు.