
కరీనా దంపతులకు తైమూర్ తిప్పలు!
ముంబయి: బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్‌ల కుమారుడు పుట్టి పుట్టగానే పెద్ద చర్చను లేవదీశాడు. తనకు తల్లిదండ్రులు పెట్టిన పేరుతో మరింతగా వార్తల్లో చెక్కర్లు కొడుతున్నాడు. మంగళవారం ఉదయం కరీనా, సైఫ్ దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఈ బాలుడికి వెంటనే తైమూర్ అలీఖాన్ పటౌడీ అంటూ నామకరణం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ పేరుకు అర్థం ఉక్కునట. అయితే, ఒకప్పుడు భారత దేశంపై దండయాత్ర చేసి ఢిల్లీలో పెను విధ్వంసం సృష్టించిన మంగోళ్ జాతి రాజు తైమూర్ పేరునే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతం అవుతోంది.
అయితే, ఈ పేరును ఎందుకు పెట్టారనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు కరీనాకానీ, సైఫ్ గానీ ఇంతవరకు చెప్పలేదు. వాస్తవానికి తైమూర్ అనే పేరు భారత్‌లో సర్వసాధారణంగా వినిపించేది కాదు. ఇది పరదేశం నుంచి వచ్చిన తైమూరు అనే మంగోల్ జాతికి చెందిన వ్యక్తిది. 14 వ శతాబ్దంలో ఢిల్లీపైకి దండెత్తి వచ్చిన తైమూరు సర్వనాశనం చేశాడు. అప్పటి నుంచి ఆ పేరు అక్కడక్కడా వినిపించడం కొంతమందికి కనిపించడం జరిగింది. అయితే, కరీనా దంపతులు తమ కొడుక్కి పెట్టిన పేరు మాత్రమే మొదటిది కాదు.
ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం తైమూరు అనే పేరుతో మొత్తం 5,500 మంది ఉన్నారంట. అయితే, ఆ పేరు అక్షరాల కూర్పులో మాత్రం భిన్నవిధాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క పశ్చిమబెంగాల్ లోనే 3,315మంది తైమూర్ అనే పేర్లుగలవాళ్లు ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో 588, బిహార్‌లో 558, మహారాష్ట్రలో 661, జార్ఖండ్‌లో 282, ఉండగా కొన్ని రాష్ట్రాల్లో ఒకటి రెండు పేర్లు ఉన్నట్లు ఓట్లర్ల జాబితా ఆధారంగా తెలిసింది.