ఇళయరాజా, విజయ్‌సేతుపతి, యువన్‌శంకర్‌రాజా
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా,విజయ్‌సేతుపతి కలిస్తే మామనిధన్. అర్థమైందను కుంటా. భారతరత్న తరువాత స్థాయి అవార్డు పద్మవిభూషణ్ సత్కారాన్ని అందుకోనున్న మేస్ట్రో ఇళయరాజా తాజాగా సంగీత బాణీలు కడుతున్నది ఎవరి చిత్రానికో తెలుసా? ఆయన కొడుకు యువన్‌శంకర్‌రాజా నిర్మించనున్న చిత్రానికే. ఈ క్రేజీ చిత్రానికి మామనిధన్ అనే పేరును నిర్ణయించారు. ఇందులో సక్సెస్‌ఫుల్ నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారన్నది తాజా వార్త.
సంగీతజ్ఞాని ఇళయరాజా చాలా కాలం క్రితమే నిర్మాతగా మారి నటుడు కమలహాసన్ హీరోగా సింగారవేలన్ అనే చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఆయన తనయుడు, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారు. వైఎస్‌ఆర్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం ప్రారంభించి ఇప్పటికే ప్యార్ ప్రేమ కాదల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్‌కల్యాణ్, నటి రైజా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇలన్ దర్శకత్వం వహిస్తున్నారు.
యువన్‌నే సంగీత బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. యువన్ మరో చిత్రానికి రెడీ అయ్యారు. అదే మామనిధన్ (మహామనిషి) చిత్రం. ఇందులో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. శీనురామస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఇతర వివరాలు వెలువడాల్సి ఉంది. ఈ చిత్రానికి తన తండ్రి ఇళయరాజాకు సంగీత బాధ్యతలు అప్పగించారు. ఇళయరాజా ఇప్పటికే ఈ చిత్రానికి సంగీత బాణీలు కట్టడంతో మునిగిపోయారట.
దీని గురించి యువన్‌శంకర్‌రాజా తెలుతూ భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో తన తండ్రి ఇళయరాజాను సత్కరించనున్న నేపథ్యంలో తమ మామనిధన్ చిత్రానికి పూర్తి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఒక కొడుకుగానే కాకుండా అభిమానిగానూ సంగీతదర్శకుడైన తన తండ్రిని చూసి గర్వపడుతున్నానన్నారు. సంగీతంలో ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని తెలిపారు. తన సంగీత పయనంలో తన సోదరుడు కార్తీక్‌రాజా సహాయ సహకారం చాలా ఉందని యువన్‌శంకర్‌రాజా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment