టైగర్ మూవీ రివ్యూ | Tiger movie review: A Tale Of Two Friends | Sakshi
Sakshi News home page

టైగర్ మూవీ రివ్యూ

Published Sat, Jun 27 2015 9:26 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

టైగర్ మూవీ రివ్యూ - Sakshi

టైగర్ మూవీ రివ్యూ

చిత్రం - టైగర్, తారాగణం - సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్, మాటలు - అబ్బూరి రవి, సంగీతం - ఎస్.ఎస్. థమన్, పాటలు - భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్, కెమేరా - ఛోటా కె. నాయుడు, సమర్పణ - 'ఠాగూర్' మధు, నిర్మాత - ఎన్.వి. ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - వి.ఐ. ఆనంద్  
 ......................................
 ఈ మధ్య కాలంలో హీరోయిన్ లేని హీరో పాత్రను చూసి ఎన్నాళ్ళయింది? సినిమాలో మూడు, నాలుగే తప్ప అంతకు మించి పాటలే లేకపోవడమనేది సగటు తెలుగు సినిమాలో సాధ్యమై ఎన్నేళ్ళయింది? ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి కోసం హీరో వెళ్ళి వెళ్ళి విలన్ ఇంట్లోనే చేరి, కథను కంచికి చేర్చడమనే సగటు తెలుగు సినిమా ఫార్ములాకు దూరంగా కమర్షియల్ సినిమా చూసి ఎన్ని రోజులైంది? బహుశా, అందుకే కావచ్చు... 'టైగర్' కాస్తంత రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది.

 కథేమిటంటే...
 అనాథాశ్రమంలో కొన్నేళ్ళు కలిసి పెరిగినప్పటి స్నేహాన్ని మర్చిపోకుండా, ఆ స్నేహితుడి కోసం కష్టాల్లో సుఖాల్లో అండగా నిలిచిన 'టైగర్' అనే కథానాయకుడి కథ ఇది. చిన్నప్పుడు టైగర్ (సందీప్ కిషన్), విష్ణు (రాహుల్ రవీంద్రన్) గోదావరి ఒడ్డున రాజమండ్రిలో అనాథాశ్రమంలో పెరిగిన అనాథలు. పిల్లల్లేని దంపతులు (దర్శక - నటుడు కాశీవిశ్వనాథ్ జంట) విష్ణును తీసుకెళ్ళి పెంచుకుంటారు. పెద్దయిన విష్ణు విశాఖపట్నంలో కాలేజీ చదువు రోజుల్లోనే కాశీలోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన గంగ (‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్ కపూర్) అనే అమ్మాయితో అనూహ్యంగా ప్రేమలో పడతాడు.

చాలాకాలం దూరంగా ఉన్న హీరో, హీరో ఫ్రెండ్ మళ్ళీ కలుస్తారు. అయితే, ఫ్రెండ్ ప్రేమ వ్యవహారంలో తలదూర్చిన హీరో మాట పడాల్సి వస్తుంది. వాళ్ళకు దూరం కావాల్సి వస్తుంది. అలాంటి టైమ్‌లో కాశీలో పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకున్న హీరో ఫ్రెండ్ జంట ఆపదలో ఇరుక్కుంటుంది. ఫ్రెండ్‌తో మాటలు కూడా లేని హీరోకు ఆ సంగతి తెలిసిందా? తెలిస్తే ఏమైంది? లాంటివన్నీ మిగతా సినిమా.

 ఎలా నటించారంటే...
 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తో ఆ మధ్య మంచి విజయం సాధించిన సందీప్ కిషన్ ఈ చిత్రంలో కాస్తంత భిన్నమైన ట్రీట్‌మెంట్ ఉన్న కథానాయక పాత్రను ఎంచుకున్నారు. తనకు అలవాటైన పద్ధతిలో పాత్రను చేసుకుంటూ వెళ్ళారు. కొన్నిసార్లు ఇతర హీరోలనూ గుర్తుతెచ్చారు. ఈ పాత్రకు తగ్గట్లు తన శారీరక భాషను మరికొంత తీర్చిదిద్దుకొని, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఉంటే, సన్నివేశాలు ఇంకా పండేవేమో అనిపించేలా చేశారు. హీరోకు బెస్ట్ ఫ్రెండ్‌గా రాహుల్ రవీంద్రన్ పాత్ర, నటన మేక్ బిలీవబుల్‌గా ఉన్నాయి. సీరత్ కపూర్‌ది కథలో ముఖ్యపాత్రే కాకపోతే, అభినయానికి అంత ఆస్కారమున్న పాత్ర కాదు. ఉన్నంతలో ఆమె బాగానే చేసిందని చెప్పుకోవాలి.

'సాప్ట్వేరులు అంతే'  అని మాటిమాటికీ అనే పాత్రధారి, అలాగే కాలేజీ ఈవెంట్ దగ్గర కాసేపు సప్తగిరి, మరికొందరు నటులు కాసేపు నవ్విస్తారు. ఇక, సినిమా సెకండాఫ్‌లో ఆసుపత్రి మార్చ్యురీ దగ్గర 'తాగుబోతు' రమేశ్ షరా మామూలుగా తాగుతూనే ఎంట్రీ ఇస్తారు. ఆసుపత్రి చీఫ్ డాక్టర్‌గా సెకండాఫ్‌లో ఒక సీన్‌లో సీనియర్ దర్శకుడు ధవళసత్యం కనిపిస్తారు. హీరో ఫ్రెండ్ మీద జరిగే హత్యాప్రయత్నం సీన్, అలాగే హీరోతో అతని ఫ్రెండ్ ఘర్షణ పడి, అసహ్యించుకొనే సీన్ బాగున్నాయి.

 సాంకేతిక విభాగాల పనితీరేమిటంటే...
తెరపై మనిషి కనిపించకపోయినా, ఈ సినిమాకు మరో పెద్ద హీరో - కెమేరామన్ ఛోటా కె. నాయుడు. ఆయన తన అద్భుతమైన కెమేరా పనితనంతో తెర నిండుగా కనువిందు చేశాడు. ఎప్పుడూ చూసే గోదావరి రైలు బిడ్జ్ దగ్గర నుంచి రాజమండ్రి అందాలు, ప్రసిద్ధమైన దేవీ చౌక్ లాంటి ప్రాంతాల లాంటివన్నీ ఏదో ఫారిన్ లొకేషన్ అనిపించేలా ఏరియల్ షాట్స్‌తో అదురుపుట్టించారు. అలాగే, కాశీలోని గంగానదిలో పడవ మీద వెళుతుంటే పక్షులు ఎగురుతూ వెళ్ళే దృశ్యం, దీపాలున్న పడవలతో నైట్ ఎఫెక్ట్ ఘట్టం, సంధ్యవేళ సాగే కాశీలోని గంగా హారతి దృశ్యాలు, సినిమా మొదట్లో వచ్చే ఛేజ్ లాంటివన్నీ పనితనమున్న ఛాయాగ్రహణమంటే ఏమిటో మరోసారి చూపెడతాయి.

థమన్ సంగీతం బాగానే ఉంది. ఎడిటింగ్ కత్తెరకు మంచి పదును పెట్టడంతో, నిడివి తక్కువై, సినిమా మొదలైనంత వేగంగానే ముగిసీపోతుంది. 'నా దృష్టిలో దేవుడి సృష్టిలో గొప్పవాళ్ళు అమ్మానాన్న' లాంటి అబ్బూరి రవి డైలాగ్స్ ప్రత్యేకించి బాగున్నాయి.   

 ఎలా ఉందంటే...
 ఈ సినిమాలో డీల్ చేసిన అంశాలూ - సమకాలీనమైనవే. కులాలు, మతాలు వేర్వేరనే కారణంతో ప్రేమలో ఉన్న కన్నబిడ్డల్ని సైతం కడతేర్చడానికి వెనుకాడక 'పరువు హత్యలు' (ఆనర్ కిల్లింగ్స్) చేయడం మన సమాజంలో ఇటీవల ఎక్కువవుతున్న విషయం. దీన్ని నేపథ్యంలో తీసుకొని, ఫ్రెండ్‌షిప్ కోసం నిలబడే పాజిటివ్ లక్షణాలున్న కథానాయకుడి చుట్టూ తిరిగే కథగా 'టైగర్'ను అల్లుకున్నారు. (నిజం చెప్పాలంటే, తింగరితనం, తేడాగా మాట్లాడడం లాంటివే హీరోయిజమ్ చలామణీ అవడం ఎక్కువయ్యాక, ఈ మాత్రం పాజిటివ్ క్వాలిటీ చూపెడుతున్న నాయక పాత్రలు తక్కువే).

కథా స్థలం కాశీయా, కాకినాడా అన్న తేడా లేకుండా, పాత్రలన్నీ తెలుగులోనే మాట్లాడినట్లు చూపించామంటూ సినిమా మొదట్లోనే ఒక గమనిక టైటిల్ వేశారు. అలా వెసులుబాటు తీసుకోవడం, ఆ మాటేదో ముందే చెప్పేయడం బాగున్నా - ఏదో ఒకటీ, అరా డైలాగ్స్ అయితే బాగుండేది. కానీ, కాశీలో ఉత్తర హిందుస్థానీ కట్టూబొట్టూతో ఉన్న పాత్రలు కూడా 'వాణ్ణి వేసేయండ్రా'  అంటూ మన ముఠాకక్షల సినిమాల్లోని పాత్రలలాగా మాట్లాడడం జీర్ణించుకోలేం. విజువల్‌కీ, ఆడియోకీ లంకె కుదరక ఆడియన్స్‌ను పైకి చెప్పలేని అసౌకర్యమేదో పీడిస్తుంది.

అలాగే, హీరో ఇంట్రడక్షన్‌లో కాకుండా, తరువాతెప్పుడో 'టైగర్...' అంటూ అసందర్భంగా వచ్చిన టైటిల్ సాంగ్ ఒక్కటే కొంత అసందర్భంగా, పానకంలో పుడకలా అనిపిస్తుంది. 1989 నాటి కథ అని టైటిల్ వేసి మరీ అప్పటికే గోదావరి మీద రెండు రైలు వంతెనలున్నట్లు ఆ దృశ్యం చూపించారు (నిజానికి, ఇప్పటి ఆర్చ్ టైప్ రెండో రైలు వంతెన ప్రారంభమైంది 1997లో). అలాగే, హీరోకు అతని ఫ్రెండ్ పరిస్థితి గురించి ఫోన్ చేసిన వ్యక్తి తాలూకు హత్య జరిగితే, హీరో నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం, 'యాక్సిడెంట్ కేస్ సార్' అని నర్సు అంటుంటే హీరో కొత్తగా వింటున్నట్లు చూడడం - లాంటి చిన్న చిన్న లోటుపాట్లున్నాయి.

అలాంటి చిన్నా చితకా లోపాలను పక్కనపెడితే, గతంలో ‘హృదయం ఎక్కడున్నది?’ సినిమా తీసిన తమిళ దర్శకుడు వి.ఐ. ఆనంద్ చేసిన ఈ మరో ప్రయత్నం బాగుంది. ప్రాణప్రదంగా ప్రేమించుకున్న ఇద్దరు స్నేహితులనే మామూలు కథను కూడా స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో చాలా ఆసక్తికరంగా మలిచారు.

సినిమాను విలక్షణంగా ప్రారంభించి, రాహుల్ రవీంద్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చెప్పిస్తూ, దాన్ని ప్రస్తుతానికి ముడివేసిన తీరు బాగుంది. కేవలం రెండు గంటల నిడివే ఉన్న ఈ సినిమా ఫస్టాఫ్ చాలా చకచకా నడుస్తుంది. సెకండాఫ్‌లో కొంత వేగం తగ్గి, చివరలో ఉపన్యాసాలు వచ్చాయి. సినిమాటిక్ ముగింపు ఇచ్చారు. అయినా సరే, మొత్తం మీద ప్రేక్షకుడు సినిమాకు పాస్ మార్కులు వేసేస్తాడు. అదే ఈ వారం రిలీజైన నాలుగైదు సినిమాల మధ్యలో ‘టైగర్’కు ఉన్న పెద్ద ఎడ్వాంటేజ్. పదే పదే చూడాలని అనిపించకపోయినా, ఒకసారి చూడడానికి  మాత్రం 'టైగర్' రెండుగంటల పాటు ఏసీ థియేటర్‌లో టైమ్‌పాస్ ముంత కింది పప్పు!
 - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement