చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌ | Tiktok Craze in TV Serial Actress | Sakshi
Sakshi News home page

టిక్‌.. ట్రాక్‌

Published Fri, Nov 15 2019 10:04 AM | Last Updated on Fri, Nov 15 2019 10:05 AM

Tiktok Craze in TV Serial Actress - Sakshi

‘ఆయన్ను నేనెంతో ప్రేమించా..నాకింత అన్యాయం చేస్తారనుకోలేదు’ అంటూ కన్నీళ్లు కుమ్మరించి వీక్షకుల కళ్లూ చెమర్చేలా చేస్తారు టీవీ స్టార్స్‌. ఇప్పుడు వీరికి ఏడుపు సన్నివేశాల విరామాల్లో వినోదాన్ని పండించేందుకు, తమ పాపులారిటీకి పదును పెట్టుకునేందుకు అందివచ్చిందో అవకాశం.. అదే టిక్‌ టాక్‌...వీమేట్‌..హలో యాప్స్‌. బుల్లితెర నటులు ఈ మధ్య షూటింగ్‌ గ్యాప్‌లో ఫన్నీ వీడియోస్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటికి వీక్షకులు, ఫాలోవర్స్‌ సంఖ్య కూడా బాగానే ఉంటోంది.

కంటతడి పెట్టించే అభినయంలో నిష్ణాతులైన చిన్నితెర స్టార్స్‌ వైవిధ్య భరిత అంశాల్లో ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి టిక్‌ టాక్‌ వీడియాలను ఎంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని, ఫాలోయర్స్‌ని సాధించుకుంటున్నారు.   

 గ్యాప్‌లో.. టాక్‌షో
సిటీలో ఎప్పుడూ ఏదో ఒక స్టూడియోలోనో, ఇంట్లోనో చిన్నితెర షూటింగ్స్‌ సర్వసాధారణం. నిన్నా మొన్నటి దాకా ఆయా షూటింగ్స్‌లో పాల్గొంటున్న తారలు షాట్‌ గ్యాప్స్‌లో పిచ్చాపాటీ మాట్లాడుకోవడంతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడా  ముచ్చట్ల స్థానాన్ని టిక్‌ టాక్‌ షూటింగ్స్‌ ఆక్రమించాయి. షూటింగ్‌ గ్యాప్స్‌లో మేకప్‌ సైతం తీయకుండానే సెకన్లు, నిమిషాల వ్యవధి వీడియోలను రూపొందించేస్తున్నారు. ఎవరితో అయినా కలిసి లేదా ఒంటరిగా వచ్చిన ఐడియా మేరకు వీడియోలు చేస్తున్నారు. ‘షూటింగ్‌ గ్యాప్స్‌లో లాంగ్‌ బ్రేక్స్‌ ఏర్పడినప్పుడు బోర్‌డమ్‌ పోగొట్టుకోవడానికి ఈ బుల్లి వీడియోలు. చాలా ఉపకరిస్తాయి’అని జీ తెలుగు సూర్య వంశం సీరియల్‌ ద్వారా పాపులరైన మీనా వాసు చెప్పారు.

పాటపై ఇష్టమే బాట వేసింది
చిన్నితెర మెగా నటిగా ఉన్న హరిత టిక్‌టాక్‌పై కూడా టాప్‌ప్లేస్‌లో ఉండడం విశేషం. జీ తెలుగులో వస్తున్న ముద్ద మందారంతో పాటు పలు సీరియల్స్‌లో ప్రేక్షకుల్ని మెప్పించే పాత్రలు పోషిస్తున్న హరిత 3 లక్షలకు పైగా ఫాలోయర్స్‌తో టిక్‌టాక్‌లో పీక్స్‌లో ఉన్నారు. ‘పాటలంటే చాలా ఇష్టం. అయితే  సీరియల్స్‌లో పాటలకి పెద్దగా ఆస్కారం ఉండదు కదా. అందుకే టిక్‌టాక్‌ ద్వారా నచ్చిన పాటలకు అభినయాన్ని జోడిస్తున్నా. నటిగా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవడానికి, ఎన్నో భావోద్వేగాలను పలికించడానికి, వినోదం అందుకోవడానికి సహకరిస్తాయీ వీడియోలు’ అంటున్నారు హరిత.

 రొటీన్‌ నుంచి రిలీఫ్‌
కెమెరాలు, డైరెక్టర్లు, దట్టంగా మేకప్పులు, చాంతాడంత డైలాగులు, కట్స్, కష్టాలు, కన్నీళ్లు, .. వీటన్నింటికీ భిన్నంగా దర్శకత్వం నుంచి సర్వం మనమే అయి రూపొందించుకునే ఈ  వీడియోల ద్వారా బోలెడంత రిలీఫ్‌ లభిస్తోందని ఈ తారలు అంటున్నారు. పెద్దగా వ్యయ ప్రయాసలేవీ లేకుండా నిమిషాల్లో తీసేసి క్షణాల్లో సోషల్‌ మీడియాలోకి అప్‌లోడ్‌ అయిపోతూ చిన్నితెర కన్నా మిన్నగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ‘బిజీ షూటింగ్స్‌ సమయంలో షాట్‌ గ్యాప్స్‌లో తీసే ఈ వీడియోలు ఒత్తిడి నివారిణిలాగా వినోదాన్ని పంచుతాయి’ అని రక్త సంబంధం, కళ్యాణ వైభోగమే సీరియల్‌ నటి మేఘనా లోకేష్‌ అంగీకరించారు.

నైపుణ్యాలకు సాన..
ఓ వైపు నటిస్తూనే మరోవైపు తమ అభినయ సామర్థ్యానికి మరింత సాన బెట్టడానికి ఇది చక్కని అవకాశంగా స్మాల్‌స్క్రీన్‌స్టార్స్‌ భావిస్తున్నారు. ‘ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్లకుండానే  టిక్‌టాక్‌ ద్వారా నటనానుభవంతో పాటూ వినోదమూ లభిస్తుంది’ అన్నారు ముద్దమందారం ఫేమ్‌ తనూజ గౌడ్‌.  ‘ఇది మన ప్రతిభ ప్రదర్శనకు వేదిక.  దీని ద్వారా మరింత మందికి నేను చేరువ అవగలుగుతున్నా’ అని చెప్పారు గంగ మంగ సీరియల్‌ నటి ప్రణవి,  ‘తొలుత ట్రెండ్‌ను అనుసరిస్తూ వీడియోలు చేశా. ఇప్పుడు అది అలవాటైంది. మీనా అక్కతో కలిసి వీడియోలు జంటగా రూపొందించడం అంటే ఇష్టం’ అని చెప్పారు సీరియల్స్‌ నటి గీతాంజలి.

భార్యతోనే జోడీ..

టైమ్‌ పాస్‌ కోసం ఎప్పుడైనా ఫ్రీ టైమ్‌లో, షూట్‌ గ్యాప్‌లో టిక్‌ టాక్స్‌ చేస్తాం. నేనూ నా వైఫ్‌ విష్ణుప్రియ చేసిన టిక్‌టాక్స్‌ ఎక్కువే. మా సీరియల్‌ హీరోయిన్‌ మేఘన నేను కూడా టిక్‌టాక్‌లు చేస్తుంటాం. టిక్‌టాక్స్‌కి ఫాలోవర్స్‌ ఎక్కువ. ఫన్‌ ఉండటంతో వర్క్‌ స్ట్రెస్‌ ఏదైనా.. రిలాక్స్‌ అయినట్టూ ఉంటుంది.  – సిద్ధార్థ్‌ వర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement