
సల్మాన్ కేసులో నేడే జడ్జిమెంట్
ముంబై: బాలీవుడ్ సినిమా స్క్రీన్‌ప్లేను తలపించేలా విచారణ జరిగిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్(49) ‘హిట్ అండ్ రన్’ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. సల్మాన్ అభిమానులు, సినీ ఇండస్ట్రీ, ఆ హీరోతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీర్పును బుధవారం ఉదయం 11.15 గంటలకు ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే వెలువరించనున్నారు. దీంతో కోర్టు ఆవరణలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. లాయర్లు, మీడియా, కోర్టు సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.
నేరం రుజువైతే: పదేళ్ల వరకు
జైలుశిక్ష పడే అవకాశం.
సల్మాన్ ఏం చేయొచ్చు: శిక్ష పడితే..
పై కోర్టుకు అపీల్‌కు వెళ్లొచ్చు.
బిజినెస్ పరిస్థితేంటి: సల్మాన్ హీరోగా పలు సినిమాలు నిర్మితమవుతున్నాయి. కొన్ని సెట్స్‌పై ఉన్నాయి. కొన్ని చర్చల్లో ఉన్నాయి. మొత్తంమీద రూ. 200 కోట్ల ప్రాజెక్టులు ఆయనపై ఆధారపడి ఉన్నాయి. సల్మాన్ జైలుకెళ్తే ఆ ప్రాజెక్టుల పరిస్థితి నిలిచిపోయే అవకాశముంది.
కేసు పూర్వాపరాలు..
ఏం జరిగింది: 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ నుంచి తన ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో సల్మాన్ బయల్దేరాడు. బాంద్రాలోని ఒక బేకరీ ముందు పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి ఆ వాహనం దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
కేసేంటి: మొదట బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారించింది. కేవలం రెండేళ్ల గరిష్ట శిక్ష పడే అవకాశమున్న ‘నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్’ ఆరోపణల మీద సల్మాన్‌పై విచారణ జరిపిన ఆ కోర్టు... 2012లో పదేళ్ల గరిష్ట జైలుశిక్ష వేసేందుకు అవకాశమున్న ‘ఐపీసీ 304 (2)(ఉద్దేశపూర్వకం కాని హత్య)’ సెక్షన్ కిందకు మార్చి, విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది.
ఏయే సెక్షన్ల కింద కేసులు: ఐపీసీ సెక్షన్లు 304(2), 279, 337, 338, 427. మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్లు.
సెషన్స్ కోర్టులో విచారణ ఇలా!
ప్రాసిక్యూషన్ వాదన: ప్రమాద సమయంలో సల్మాన్‌ఖాన్ స్వయంగా ఆ వాహనాన్ని నడుపుతున్నాడు. అప్పుడు ఆయన మద్యం మత్తులో ఉన్నాడు. హోటల్‌లో బకార్డి రమ్ తీసుకున్నట్లు సాక్ష్యాలున్నాయి. వేగంగా డ్రైవ్ చేయొద్దని తాను చెప్పినట్లు సల్మాన్ బాడీగార్డ్ రవీంద్ర పాటిల్(సాక్ష్యం ఇచ్చిన కొన్ని రోజుల తరువాత చనిపోయాడు) ఇచ్చిన సాక్ష్యం ఉంది. ఆ సమయంలో సల్మాన్ మద్యం మత్తులో ఉన్నాడని కూడా రవీంద్ర చెప్పాడు.
డిఫెన్స్ వాదన: ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తోంది సల్మాన్ కాదు.. ఆయన డ్రైవర్ అశోక్‌సింగ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అశోక్ కోర్టు ముందు ఒప్పుకున్నాడు. ప్రమాద సమయంలో సల్మాన్ తాగి లేడు. హోటల్‌లో కేవలం గ్లాస్ మంచినీళ్లు మాత్రమే తాగాడు. ప్రాసిక్యూషన్ వాదిస్తున్నట్లు హోటల్ నుంచి గంటకు 90 కి.మీ.లవేగంతో వస్తే ప్రమాదస్థలికి రావడానికి 10 నిమిషాలే పడ్తుంది. కానీ హోటల్ నుంచి బయల్దేరిన అరగంట తర్వాతే ప్రమాదం జరిగింది.
దర్యాప్తులో లోపం: పోలీసులు వాహనం స్టీరింగ్ వీల్‌పై ఉన్న వేలిముద్రలను సేకరించలేదు.