సల్మాన్ ఖాన్కు అయిదేళ్ల జైలు శిక్ష
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు అయిదేళ్లపాటు జైలు శిక్ష పడింది. బుధవారం మధ్యాహ్నం ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే ఈ మేరకు తీర్పును వెలువరించారు. సల్మాన్ కు జైలు శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించారు. దాంతో సల్మాన్ ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ను ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించే అవకాశముంది. బాధితులకు మరింత నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని సెషన్స్ కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు ఐదేళ్లు శిక్షపడటంతో బెయిల్ పిటిషన్ ను హైకోర్టులోనే దాఖలు చేయాల్సి ఉంటుంది.
కాగా 2002 సెప్టెంబర్ 28 అర్థరాత్రి సల్మాన్ బాంద్రాలోని అమెరికన్ బేకరీ సమీపంలో రోడ్డుపై నిద్రపోతున్న వ్యక్తులపై నుంచి తన వాహనాన్ని పోనిచ్చాడు. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు బాంద్రా పోలీసులు సల్మాన్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 29, 2002లో ఆయనకు బెయిల్ మంజూరైంది. నాటి నుంచి ఈ కేసు కోర్టుల చుట్టు తిరుగుతోంది.