మొన్న మున్నాభాయ్.. నేడు సల్లూభాయ్
ముంబై: బాలీవుడ్లో అగ్రహీరోలుగా నీరాజనాలందుకున్నారు. కోట్లాది రూపాయలను, కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. వెండితెరపైనే హీరోలయ్యారు కానీ నిజజీవితంలో మాత్రం కాలేకపోయారు. నేర ప్రవృత్తితో ప్రతిష్టను మసకబార్చుకుని విలన్లుగా మారారు. చివరకు కటకటాలపాలయ్యారు. బాలీవుడ్ హీరోలు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ నిజజీవిత చరిత్ర ఇది. మొన్న మున్నాభాయ్, నేడు సల్లూభాయ్ జైలు కెళ్లారు. వెండితెర వేల్పలకు జైలు శిక్ష పడటం అభిమానులకు ఆవేదన కలిగించినా, సామాన్యులకు చట్టాలపై మరింత గౌరవం పెరిగింది.
అక్రమాయుధాలు, ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్కు ఐదేళ్ల శిక్ష పడిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ ప్రస్తుతం పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ కేసు విచారణలో సంజయ్ దోషీగా తేలాడు. ముంబై బాంబు పేలుళ్ల సమయానికి సంజయ్ బాలీవుడ్లో అగ్రహీరో. చెడు మార్గం పట్టడంతో ప్రతిష్ట దిగజారింది. అప్పట్లో సంజయ్తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు భారీగా నష్టపోయారు.
తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో దోషిగా నిర్ధారణయ్యాడు. ఈ కేసు విచారణ కూడా సుదీర్ఘకాలం సాగినా సల్మాన్ నేరం చేసినట్టు రుజువైంది. బుధవారం ఉదయం ముంబై సెషన్స్ కోర్టు ఆయనపై నమోదైన అభియోగాలు అన్ని నిజమే అని స్పష్టం చేసింది. 2002లో సల్మాన్ మద్యం తాగి కారునడిపి ఒకరి మరణానికి కారణమవడంతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపరిచాడు. సల్మాన్కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. కాసేపట్లో తీర్పు వెలువడనుంది. సంజయ్ ఉదంతం మాదిరే సల్మాన్ విషయంలోనూ నిర్మాతలు కూడా కోట్లాది రూపాయలు నష్టపోయే అవకాశముంది. రూ. 200 కోట్ల ప్రాజెక్టులు ఆయనపై ఆధారపడి ఉన్నాయి.