రాశీఖన్నా,నమ్రతా
ఉన్నవాటిని గౌరవిద్దాం
- రాశీఖన్నా
‘‘మన దగ్గర ఉన్నవాటితో సంతృప్తి చెందాలనే విషయాన్ని ఈ లాక్ డౌన్ నేర్పింది’’ అంటున్నారు రాశీఖన్నా. లాక్ డౌన్‌ని ఎలా గడుపుతున్నారో రాశీ చెప్పారు.
♦ మన దగ్గర ఉన్నవాటిని గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ని గౌరవించాలి. అన్ని వసతులు ఉన్నవాళ్లు చాలా అదృష్టవంతులు. కానీ అదృష్టాన్ని ఇష్టానుసారంగా తీసుకుంటాం. గౌరవించడంలేదు. గౌరవించాలనే విషయాన్ని ఈ లాక్ డౌన్ నేర్పింది.
♦ ఇప్పుడు నా ఆలోచనలు చాలా ఆధ్యాత్మికంగా మారాయి. ఇంట్లో టీవీలు చూస్తూ, పేపర్లు చదువుతూ ఉండిపోవడంలేదు. వంట చేస్తున్నాను. గార్డెనింగ్‌కి టైమ్ కేటాయిస్తున్నాను. ఇల్లు శుభ్రం చేస్తున్నాను. తమిళం నేర్చుకుంటున్నాను. ధ్యానం చేస్తున్నాను.
♦ లాక్ డౌన్ పూర్తయ్యేలోగా గిటార్ పూర్తిగా నేర్చుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను.
ఆన్‌లైన్‌లో అల్లికలు నేర్చుకుంటున్నాను
– నమ్రతా మహేష్
‘‘లాక్‌డౌన్ వల్ల ఆలోచించుకోవడానికి నాకు చాలా సమయం దొరికినట్లయింది. రోజులో కొంత సమయాన్ని ఆత్మపరిశీలన కోసం కేటాయిస్తున్నాను. మన కుటుంబం మనందరికీ చాలా ముఖ్యమైనది. కుటుంబంతో మనం సరదాగా గడిపే చిన్న చిన్న విషయాలు, సంఘటనలు చాలా సంతోషాన్నిస్తాయి. జ్ఞాపకాలుగా మిగిలి పోతాయి’’ అన్నారు నమ్రతా మహేష్. ఇంకా లాక్‌డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ఈ విధంగా చెప్పారు.
♦ పిల్లల్ని (కుమారుడు గౌతమ్, కుమార్తె సితార) చదివించడం, వారితో సరదా సమయాన్ని గడపడం, నేను పుస్తకాలు చదవడం, టీవీ చూడటం, వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేస్తూ వీలైనంత తొందరగా రాత్రివేళ నిద్రపోవడం.. ఇప్పుడు మా డైలీ లైఫ్ ఉంది.
♦ కొత్త విషయాలను నేర్చుకోవడానికి నేనెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాను. ప్రస్తుతం ఈ లాక్‌డౌన్ సమయంలో ఓ ఫ్రెండ్ సాయంతో ఆన్‌లైన్‌లో అల్లికలు నేర్చుకుంటున్నాను.
లాక్ డౌన్‌లో ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ గడుపుతున్నారు మహేష్ బాబు. పిల్లలతో సరదాగా ఆటలు ఆడుతున్నారు. మహేష్‌కి ఆయన కూతురు సితార హెడ్ మసాజ్ చేస్తున్న ఫొటోను నమ్రత షేర్ చేశారు. ‘‘నాన్నకు హెడ్ మసాజ్ చేశాను. తనకు చాలా నచ్చింది’’ అని మురిసిపోతూ తన ఇన్‌స్టా గ్రామ్‌లో రాసుకొచ్చింది సితార.
మహేష్, సితార
Comments
Please login to add a commentAdd a comment