
భవనంపై నుంచి పడి సినీ హీరో తండ్రి మృతి
వర్ధమాన సినీ నటుడు తనీష్ తండ్రి వర్ధన్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం వేకువజామున కన్నుమూశారు.
- సినీ హీరో తనీష్ తండ్రి ఏసు వర్ధన్ బాబు అనుమానాస్పద మృతి
- ఆత్మహత్యకు పాల్పడ్డారా? జారిపడ్డారా? అనే విషయం నిర్ధారణ కాలేదన్న పోలీసులు
హైదరాబాద్: యువ సినీ హీరో తనీష్ తండ్రి ఏసు వర్ధన్‌బాబు(50) భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మంగళవారం అర్ధరాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సినీ హీరో తనీష్ తండ్రి ఏసు వర్థన్‌బాబు, భార్య సరస్వతి, కుమారులు తనీష్, వంశీకృష్ణ, కాశీవిశ్వనాథ్‌తో కలసి రాయదుర్గంలోని వెస్ట్రన్ ప్లాజాలోని ఏ బ్లాక్ ఫ్లాట్ నంబర్ 623లో నివాసం ఉంటున్నారు.
ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏసు వర్ధన్ కొడుకులతోనే ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12.30 వరకు ఏసు వర్ధన్ ఫ్లాట్ బాల్కానీలో మద్యం సేవిస్తూ కూర్చున్నారు. బాల్కనీ నుంచి కేకలు వినిపించడంతో భార్య సరస్వతి వచ్చిచూడగా.. ఏసు వర్ధన్ అప్పటికే భవనంపై నుంచి కిందపడిపోయి ఉన్నారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.
పోలీసులు ఏసు వర్థన్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏసు వర్ధన్ బిగ్గరగా అరవడంతో బాల్కనీలోకి వెళ్లి చూసేసరికి భవనంపై నుంచి కిందపడి ఉన్నాడని, పైనుంచి జారిపడి ఉండవచ్చని ఆయన భార్య సరస్వతి పోలీసులకు తెలిపింది. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల మణికొండలోని ఓ ఫ్లాట్‌ను ఏసు వర్ధన్ అమ్మినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భార్యాభర్తలకు గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే మద్యం మత్తులో జారిపడ్డారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే విషయం నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. ఏసు వర్ధన్ భవనంపై నుంచి పడినప్పుడు భార్య సరస్వతితో పాటు చిన్న కొడుకు ఇంట్లో ఉన్నారని, మిగతా ఇద్దరూ ఫ్లాట్‌లో లేరని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.