
చెన్నై : దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరు నటి త్రిష. అందం, అభినయాలతో ఈ స్థాయికి చేరుకున్న ఈ అమ్మడికి చాలా కాలంగా రజనీకాంత్‌తో నటించాన్న కోరిక ఇటీవల పేట చిత్రంతో నెరవేరింది. తన సహ నటీమణులు నయనతార, అనుష్కలా కుటుంబకథా చిత్రాలు, రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాల్లో నటించి సక్సెస్ అయిన ఈ బ్యూటీకి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించి రాణించాలన్న ఆశ మాత్రం ఇంకా నెరవేరలేదు. ఆ ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేకపోయింది. తను ఎంతో ఇష్టపడి నటించిన నాయకి చిత్రం త్రిషను నిరాశ పరిచింది. ఆ తరువాత నటించిన మోహిని చిత్రం అదే బాటలో నడిచింది. ప్రస్తుతం ఆ తరహాలో గర్జన, 1818, పరమపదం విళైయాట్టు వంటి చిత్రాల్లో నటిస్తున్నా, వాటి నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది.
తాజాగా నటిస్తున్న చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో కూడినదే కావడం విశేషం. దీనికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథ, సంభాషణలను అందించారు. ఇంతకుముందు ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన శరవణన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభమై తొలిషెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ త్వరలో విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. దీనికి రాంగీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. తాజా షెడ్యూల్‌ను ఉజ్బెకిస్తాన్‌లో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ షెడ్యూల్‌లో ఎక్కువగా నటి త్రిషకు సంబంధించిన పోరాట దృశ్యాలనే చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంతోనైనా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో సక్సెస్ కావాలన్న త్రిష ఆశ నెరవేరేనా? అన్న ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు గర్జన చిత్రంలోనూ త్రిష పోరాట సన్నివేశాల్లో నటించింది. అయితే ఆ చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతోంది. దీంతో రాంగీ చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం త్రిష టైమ్ బాగుందనే చెప్పవచ్చు. తన నటించిన 96, పేట చిత్రాలు విజయం సాధించాయి. అదే సక్సెస్ రాంగీ చిత్రానికీ కొనసాగుతుందనే నమ్మకంతో త్రిష ఉందట.