చెన్నై : ఆ విషయంలో పెద్దల మాట వినను అంటోంది హీరోయిన్ త్రిష. మోడలింగ్ రంగం నుంచి సినిమాకు వచ్చిన వారిలో ఈ అమ్మడు ఒకరు. అయితే రాత్రికి రాత్రి హీరోయిన్ అయిపోలేదు. చాలా ప్రయత్నాలు తరువాత జోడి చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా కనిపించి కనిపించని పాత్రలో నటించి ఆ తరువాతే హీరోయిన్‌గా ప్రమోట్ అయింది. ఈ బ్యూటీ సినీ జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం సంచలనమే. వరుణ్‌మణిమన్ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో ప్రేమ, పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయింది. అదేవిధంగా తెలుగులో ఒక యువ హీరోతో ప్రేమాయణం అనే ప్రచారం జోరుగానే సాగింది.
కాగా నటిగా 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే నటిగా మాత్రం త్రిష కెరీర్‌కు ఇప్పటి వరకూ డోకా లేదు. మధ్యలో అపజయాలతో వెనుకపడినా, 96 చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం పరమపదం విళైయాట్టు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఇటీవల విడుదల కావలసింది. థియేటర్ల సమస్య కారణంగా వాయిదా పడింది. కాగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో విమర్శలను ఎదుర్కొంది. నిర్మాతల సంఘం కూడా హెచ్చరికలు చేసేవరకూ పరిస్థితిని తెచ్చుకుంది. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో త్రిష పేర్కొంటూ ప్రమోషన్లకు ఎగ్గొట్టే అలవాటు తనకు లేదని చెప్పింది. షూటింగ్‌లకు కూడా చెప్పిన టైమ్‌కు స్పాట్‌లో ఉండి పూర్తి అయ్యేవరకూ ఉంటానని చెప్పింది. సమీప కాలంలో అనుకోకుండా ఒకే సారి రెండు కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించడం వల్ల సమస్య తలెత్తిందని వివరించింది.
సరే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఎప్పుడుచేసుకోనున్నారు? అన్న ప్రశ్నకు తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కానీ, ఎప్పుడు చేసుకుంటానన్నది చెప్పలేదని అంది. పెళ్లి విషయంలో కుటుంబ పెద్దలు చెప్పే మాటను వినను అని చెప్పింది.వారు చూసిన వరుడిని పెళ్లి చేసుకోనంది. తాను ప్రేమించే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు తనను చక్కగా చూసుకునేవాడై ఉండాలంది. తనుహీరో కానవసరం లేదని, అందంగా ఉండాల్సిన పని లేదని అంది. ఇక రంగు విషయంలో ఎలాంటి ఆక్షేపణ లేదంది. అయితే మంచి మనసున్నవాడై ఉండాలని చెప్పింది. తనను అర్థం చేసుకుని బాగాచూసుకోవాలని చెప్పింది. అలాంటి వ్యక్తి తారస పడితే వెంటనే పెళ్లి చేసుకుంటానని త్రిష పేర్కొంది. మరి అలాంటి లక్షణాలున్న వాడు ఎక్కడున్నాడో!
Comments
Please login to add a commentAdd a comment