బన్నీ, మహేష్ల మధ్య త్రివిక్రమ్
ప్రస్తుతం స్టార్ హీరోలు, టాప్ టెక్నిషియన్లు అందరూ సమ్మర్ సీజన్నే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్లు తమ సినిమా రిలీజ్ల కోసం డేట్లు లాక్ చేయగా మరి కొంతమంది డైలామాలో ఉన్నారు. ముఖ్యంగా తొలిసారిగా మీడియం రేంజ్ హీరో నితిన్తో అ..ఆ.. సినిమా చేస్తున్న త్రివిక్రమ్, తన సినిమా రిలీజ్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో ఆలస్యమైంది.
తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 22న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు త్రివిక్రమ్. కానీ అదే సమయానికి బన్నీ సరైనోడు సినిమాతో థియేటర్లలోకి వస్తుండటంతో మాటల మాంత్రికుడు ఆలోచనలో పడ్డాడు. బన్నీతో మంచి స్నేహం ఉన్న త్రివిక్రమ్ అతని సినిమాతో పోటీకి సిద్ధంగా లేడు. అందుకే తన సినిమాను మరో రెండు వారాల పాటు వాయిదా వేయాలని భావిస్తున్నాడు.
అయితే ఈ వాయిదా కూడా సాధ్యపడేలా కనిపించటం లేదు. ఇప్పటికే మే 8 మహేష్ బాబు హీరోగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రకటించేశారు. దీంతో అనుకున్న సమయాని కన్నా ఆలస్యం అయితే బన్నీతో కాదని మహేష్తో త్రివిక్రమ్ పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ తన సినిమా రిలీజ్ డేట్ను ఎలా నిర్ణయిస్తాడో చూడాలి.