
క్రేజీ కాంబినేషన్ కిక్కే వేరప్పా!
‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత కొద్ది నెలలుగా తమిళ సినిమా షూటిం గ్‌లతో చెన్నైలోనే తెగ బిజీగా ఉన్నారు సమంత. ఇప్పుడు ఆమె మళ్ళీ తెలుగు సినిమాతో కెమేరా ముందుకొస్తున్నారు. దర్శక - రచయిత త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేస్తున్న సినిమాలో ఆమే హీరో యిన్. పవన్‌కల్యాణ్ ‘అత్తారింటికి దారేది?’, అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత ముచ్చటగా మూడోసారి ఆమె త్రివిక్రమ్ దర్శక త్వంలో నటిస్తున్నారన్న మాట.
విశేషం ఏమిటంటే, స్టోరీలైన్ స్థూలంగా ముందే ఆమెకు తెలుసు. దాంతో, స్క్రిప్ట్, తారాగణం ఖరారు కాక ముందే ప్రధాన పాత్రకు సమంత ఓకె చెప్పేశారు. హీరో ఎవరనేది తేలడమే ఆలస్యమైంది. రకరకాల ఊహా గానాలు వచ్చినా, చివరకు నితిన్ హీరో అని కన్‌ఫర్మ్ అయింది. ఆ రకంగా నవతరం క్రేజీ డెరైక్టర్స్‌లో అటు రాజమౌళితోనూ (‘సై’), ఇటు త్రివిక్రమ్‌తోనూ పనిచేసిన ఏకైక యువహీరోగా కొత్త రికార్డ్ నితిన్‌కు రానుంది.
మరోపక్క తెరపై నితిన్, సమంతల కాంబినేషన్ కూడా ఇదే ఫస్ట్ టైమ్. ‘వై దిస్ కొలవెరి’ పాటతో దేశమంతటినీ ఉర్రూతలూపిన తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించనున్నా రని తాజా ఖబర్. రాజీవ్‌మీనన్ కెమెరామన్. మొత్తానికి, అంతా క్రేజీ కాంబినేషనే. ఈ నెలాఖరు కల్లా సెట్స్ మీదకు రానున్న ఈ సినిమాలో సమంతకు సెట్స్‌పై తమిళ టెక్నీషియన్స్‌తో చాలా కాలక్షేపమే జరిగేలా ఉంది. ఇటీవలే తొలిసారిగా తమిళంలో సొంత డబ్బింగ్ కూడా చెప్పారామె. తెలుగు ఎంత చక్కగా మాట్లాడినా, అలవాటైన మనుషులు, వాతావరణం, భాష అయితే, ఆ కిక్కే వేరప్పా!