నిలాణి
పెరంబూరు: పోలీసులను తప్పుగా చిత్రీకరించాలన్నది తన ఉద్దేశం కాదు. పాపులారిటీ కోసమే అలా చేశాను అని బుల్లితెర నటి నిలాణి పోలీసుల విచారణలో వివరించింది. ఇటీవల తూత్తుకుడి కాల్పులు సంఘటన రాష్ట్రంలో కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. నటుడు రజనీకాంత్ లాంటి వారే ఈ వ్యవహారంలో తీవ్ర వ్యతిరేకతను చవిచూసిన విషయం విదితమే. కాగా ఆ సంఘటనలో పోలీసుల కాల్పులను, ప్రజల హాహా కారాలను, ప్రాణాలు బలిగొన్న దృశ్యాలను బుల్లితెర నటి నిలాణి పోలీసు దుస్తులు ధరించి వీడియో తీసి కామెంట్స్‌తో సహా దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో స్థానిక వడపళనికి చెందిన రిషీ అనే వ్యక్తి గత 22వ తేదీన వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు బుల్లితెర నటి నిలాణిపై కేసు నమోదు చేసి ఇన్‌స్పెక్టర్ చంద్రు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.అందులో ఈ వీడియోను తీసిన యువతి స్థానిక సాలిగ్రామానికి చెందిన బుల్లితెర నటి నిలాణి అని తెలిసింది. బుధవారం వేకువ జామున పోలీసులు నీలాణిని నీలగిరి జిల్లా కున్నూర్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో నిలాణి ఇచ్చిన వాంగ్మూలంలో తంజావూరుకు చెందిన తనకు చిన్నతనం నుంచి నటన అంటే చాలా ఇష్టం అని, అయితే సినిమాలో అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై చిన్న చిన్న పాత్రలు ధరిస్తున్నట్లు చెప్పిందన్నారు. ఇటీవల జల్లికట్టు పోరాటంలో పాల్గొన్నానని, అయినా తనకు గుర్తింపు రాకపోవడంతో తూత్తుకుడి కాల్పుల సంఘటన వీడియో తీసి పాపులర్ అవ్వాలన్న ఆలోచనతోనే అలా చేశానని, అంతే గానీ పోలీసులను తప్పుగా చిత్రీకరించాలన్నది తన ఉద్దేశం కాదని నిలాణి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment