
ఆ రెండింటికే రూ.2కోట్లా!
తమిళసినిమా: రెండు రోజుల కాల్‌షీట్స్..పారితోషికం రూ.5 కోట్లు. ఏమిటీ అర్థం కాలేదా? అయితే రండి ఈ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ మోస్ట్ హీరోయిన్ అంటే అది నయనతారనే. ఒక్క చిత్రానికి నాలుగు కోట్లు పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిన నటి ఈ కేరళా బ్యూటీ.
అయ్యా(చిత్రం) అంటూ కోలీవుడ్‌కు దిగుమతి అయిన నయనతార ( అసలు పేరు డయానా) తన సినీ పయనంలో పలు ఎత్తుపల్లాలను చూసి ఈ స్థాయికి చేరుకుంది. నటిగా 13 వసంతాలను పూర్తి చేసుకున్న నయనతార నిజజీవితంలోనూ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎదురొడ్డి నిలిచింది.
ఒక దశలో ఈ అమ్మడి పరిస్థితి చూసి అయ్యో పాపం అని జాలి పడినవారు లేకపోలేదు. అలాంటి నయన్ అంటే అభిమానుల్లో ఇప్పటికీ పిచ్చ క్రేజ్.ఇటీవల నయనతార నటించిన చిత్రం డోర విడుదలై నిరాశపరచింది.అయినా ఈ క్రేజీ హీరోయిన్ మార్కెట్ ఏ మాత్రం సడలలేదు. ఇప్పటికీ దక్షిణాది నిర్మాతలు ఈమె కాల్‌షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారనడం అతిశయోక్తి కాదేమో.
కాగా నయనతార టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్నా, ఇటీవల వరకూ ఆ పాపులారిటీని ఇతరత్రా వాడుకోలేదు. చాలా మంది కథానాయికలు తమ ఇమేజ్‌ను వాణిజ్య ప్రకటనలకు వాడుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.ఈ మధ్యనే నయనతార కూడా వాణిజ్య ప్రకటనలో నటించడం ప్రారంభించారు. ఇటీవల ఒక డీటీహెచ్ వాణిజ్య ప్రకటనలో నటించారు. అయితే అందుకు ఈ భామ పుచ్చుకున్న మొత్తం రూ.5 కోట్లట.అందుకు కేటాయించింది మాత్రం కేవలం రెండురోజుల కాల్‌షీట్సేనట. ఈ సమాచారం విన్న స్టార్ హీరోలే అవాక్కు అవుతున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. మరి నయనతారా..మజాకా.