లఘు చిత్రాల నేపథ్యం నుంచి వచ్చిన దర్శకులు వెండితెర మీద మంచి విజయాలు సాధిస్తున్నారు. అదే బాటలో మరో యువకుడు వెండితెర మీద అరంగేట్రం చేశాడు. లఘు చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా, దర్శకుడిగా స్వీయ నిర్మాణంలో ఓ సినిమాను తెరకెక్కించాడు. ప్రతీక్ కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటించిన ఈ సినిమా రొటీన్ ట్రయాంగులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఓ సస్పెన్స్ ఎలిమెంట్ తో రూపొందించారు.
కథ విషయానికి వస్తే ప్రతీక్ సరదా ఫ్రెండ్స్ తో కాలం గడిపే కుర్రాడు. ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసే ప్రతీక్ తన ఫ్రెండ్ వాసు కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. వాసు ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారని తెలుసుకున్న ప్రతీక్ ఆ అమ్మాయిని తీసుకొచ్చేందుకు వెళతాడు. ఇంటి ముందు వెయిట్ చేస్తే చాలు ఆ అమ్మాయే వచ్చి బైక్ ఎక్కుతుందని వాసు చెప్పటంతో ముఖం కూడా తెలియని అమ్మాయి తీసుకొచ్చేందుకు ఒప్పుకుంటాడు. కానీ విషయం తెలుసుకున్న అమ్మాయి మనుషులు వెంబడిస్తారు. పారిపోయే ప్రయత్నంలో అమ్మాయితో సహా లోయలో పడిపోతాడు.
ప్రతీక్ ను కొంతమంది మెడికోలు కాపాడి ట్రీట్ మెంట్ చేస్తారు. కానీ తనతో పాటు లోయలో పడ్డ అమ్మాయి ఎమయ్యిందో మాత్రం తెలియదు. ఆమె ముఖం కూడా తెలియన ప్రతీక్, లోయలో పడిన సమయంలో ఆమె నడుము మీద ఉన్న టాటూను చూసి దాని ఆధారంగా అమ్మాయిన వెతికే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో తనను కాపాడిన మెడికోల్లో ఒకరైన నిత్యతో ప్రేమలో పడతాడు. చివరకు ప్రతీక్ వెతుకుతున్న టాటూ అమ్మాయి దొరికిందా..? అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏమయ్యింది..? అన్నదే మిగతా కథ.
వెండితెరకు కొత్తే అయినా హీరో ప్రతీక్, హీరోయిన్ శ్రావ్యరావ్ తమపరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా డ్యాన్స్ ల్లో ప్రతీక్ చూపించిన ఈజ్ ఆకట్టుకుంటుంది. హీరోగానే కాదు దర్శకుడిగానూ ప్రతీక్ మంచి ప్రయత్నమే చేశాడు. ఆసక్తికర సన్నివేశంతో సినిమాను మొదలుపెట్టి, ఆ సస్పెన్స్ ను చివరి వరకు కొనసాగించటంలో సక్సెస్ సాధించాడు. టేకింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. హీరోగానే కాక నిర్మాతగా, ఎడిటర్ గానూ తానే వ్యవహరించిన ప్రతీక్ చాలా సందర్భాల్లో తడబడ్డాడు. ఓవరాల్ గా రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు సస్పెన్స్ ఎలిమెంట్ జోడించి ప్రతీక్ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment