'వంగవీటి' మూవీ రివ్యూ | Vangaveeti Movie Review | Sakshi
Sakshi News home page

'వంగవీటి' మూవీ రివ్యూ

Published Fri, Dec 23 2016 12:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

'వంగవీటి' మూవీ రివ్యూ

'వంగవీటి' మూవీ రివ్యూ

టైటిల్ : వంగవీటి
జానర్ : క్రైం థ్రిల్లర్
తారాగణం : సందీప్ కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలి, కౌటిల్యా, శ్రీతేజ్
సంగీతం : రవి శంకర్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : దాసరి కిరణ్ కుమార్

చాలా కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ.., ఇదే తెలుగులో నా ఆఖరి సినిమా.. ఈ సారి తప్పకుండా మెప్పిస్తానని చెప్పి మరీ తీసిన సినిమా వంగవీటి. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో రక్తచరిత్ర తీసిన వర్మ, పాత్రలను నిజజీవిత పేర్లతో కాకుండా ఆ భావం వచ్చేలా చూపించాడు. కానీ వంగవీటి విషయంలో మాత్రం మరో అడుగు ముందుకు వేసి.. నిజజీవితంలోని పేర్లతో యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన వంగవీటి వర్మ స్థాయిని ప్రూవ్ చేసిందా..?

కథ :
విజయవాడ రౌడీయిజం.. అందరికీ తెలిసిందే అయినా వర్మ తన మార్క్ సినిమాటిక్ టచ్తో ఆ కథను మరింత ఎఫెక్టివ్గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎర్రపార్టీ నాయకుడు చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్గా ఎదుగుతాడు. అదే సమయంలో బస్టాండ్లో చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ. వెంకటరత్నం దగ్గర పనిలో చేరి అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. రాధ ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానిస్తాడు. తనకు జరిగిన అవమాన్ని జీర్ణించుకోలేని రాధ వెంకటరత్నాన్ని పక్కా ప్లాన్తో దారుణంగా నరికి నరికి చంపుతాడు.

అప్పటి వరకు ఓ లీడర్ వెనుక అనుచరిడిగా ఉన్న రాధ, వెంకటరత్నం మరణంతో విజయవాడను శాసించే నాయకుడిగా మారతాడు. తనకు ఎదురొచ్చిన వారందరిని అడ్డుతప్పించుకుంటూ ఎవరూ ఎదిరించలేని స్థాయికి చేరుకుంటాడు. ఆ సమయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే దేవినేని గాంధీ, దేవినేని నెహ్రులు కాలేజీ గొడవలో పార్టీ ప్రమేయాన్ని ఆపాలంటూ రాధను కలుస్తారు. రాధ మంచితనం నచ్చి అతనితో కలిసి ఓ పార్టీని ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి రాధకు అండగా నిలుస్తారు.

రాధ ఎదుగుదలతో విజయవాడ నగరంలో ఎర్ర పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతాయన్న భయంతో ఆ పార్టీ పెద్దలు రాధ హత్యకు పథకం వేస్తారు. ఓ సెటిల్మెంట్ కోసం పిలిపించి ఒంటరిని చేసి చంపేస్తారు. అప్పటి వరకు రాజకీయం, రౌడీయిజం తెలియని రాధ తమ్ముడు రంగా., తప్పనిసరి పరిస్థితుల్లో అన్న బాటలోకి అడుగుపెడతాడు. అప్పటి వరకు అన్నకు అండగా ఉన్న దేవినేని సోదరులతో అభిప్రాయ భేదాలు రావటంతో వారు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. దేవినేని సోదరుల నుంచి రంగా ప్రాణానికి ముప్పు ఉందని భావించి ఆయన అనుచరులు గాందీని చంపేస్తారు. అన్న మరణంతో దేవినేని మురళి రగలిపోతాడు. ఎలాగైన రంగా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. (శివ టు వంగవీటి.. ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి)

అప్పటి వరకు రౌడీగా ఉన్న రంగా ఓ జాతీయ పార్టీ నుంచి టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అదే సమయంలో ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీలో చేరిన నెహ్రు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. నెహ్రు ఎమ్మెల్యే కావటంతో అతని తమ్ముడు మురళీకి పగ తీర్చుకునేందుకు కావాల్సిన అన్ని వనరులు అందుతాయి. దీంతో గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక్కొక్కరిని వెతికి వెతికి చంపుతాడు. అంతేకాదు ఏకంగా రంగా.. ఇంటికే ఫోన్ చేసి ఆయన భార్య రత్న కుమారికి వార్నింగ్ ఇస్తాడు.

మరోసారి మురళీ వల్ల రంగాకు ప్రమాదం ఉందని భావించి అతన్ని కూడా రంగా అనుచరులు చంపేస్తారు.
అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ విజయవాడలో పెరిగిపోతున్న రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రజా సమస్యల కోసం తన ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తున్న రంగాను నల్ల బట్టల్లో వచ్చిన దుండగులు దీక్షా వేదిక మీద నరికి చంపేస్తారు. రంగ మరణంతో రగిలిపోయినా విజయవాడ కొద్ది రోజులకు సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే రంగా మరణం వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం వర్మ కూడా ప్రేక్షకులకు ప్రశ్నగానే వదిలేశాడు.

నటీనటులు :
కేవలం పాత్రలే కనిపించాలనే ఉద్దేశ్యంతో దాదాపు అంతా కొత్త వారితోనే వంగవీటి సినిమాను తెరకెక్కించాడు వర్మ. కీలకమైన వంగవీటి రాధ, వంగవీటి రంగా పాత్రల్లో కనిపించిన సందీప్ కుమార్, ఆవేశపరుడైన రౌడీగా.. ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడిగా బాగా నటించాడు. రంగా భార్య పాత్రలో నైనా గంగూలీ ఆకట్టుకుంది. పెళ్లికి ముందు అల్లరి అమ్మాయిగా.. తరువాత హుందాగా కనిపించే రంగా భార్యగా మంచి వేరియేషన్స్ చూపించింది. హ్యాపిడేస్ సినిమాలో స్టూడెంట్గా ఆకట్టుకున్న వంశీ చాగంటి ఈ సినిమాలో దేవినేని మురళీ పాత్రలో మెప్పించాడు. అన్న మరణంతో రగిలిపోయే పాత్రలో వంశీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇతర పాత్రల్లో వంశీ నక్కంటి, కౌటిల్య, శ్రీ తేజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
యాధార్థ ఘటనల ఆధారంగా  సినిమాలను తెరకెక్కించటంలో వర్మకు తిరుగులేదు. అయితే గతంలో పక్కా కథాకథనాలతో పాటు తన మార్క్ టేకింగ్తో ఆకట్టుకున్న వర్మ, ఈ మధ్య తీస్తున్న సినిమాల్లో ఆ క్వాలిటీ చూపించటంలేదు. హడావిడిగా చుట్టేస్తూ కేవలం తన బ్రాండ్ వాల్యూ మీదే సినిమాను నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు.  వంగవీటి విషయంలోనే అదే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా భాగం సినిమాను తన వాయిస్ ఓవర్తో నడిపించి.. అసలు కథ కన్నా ఎక్కువగా సీన్స్నే ఎలివేట్ చేశాడు. వర్మ మార్క్ సినిమాటోగ్రఫి, నేపథ్య సంగీతం మరోసారి ఆకట్టుకోగా మితిమీరిన రక్తపాతం అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
వర్మ మార్క్ టేకింగ్
సందీప్ ద్విపాత్రాభినయం
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
డైలాగ్స్
మితిమీరిన రక్తపాతం


- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement