రాజమౌళి, నాగార్జునలపై ఒట్టేసి చెబుతున్నా!
- దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ
‘‘నాతో పాటు తెలుగు సినిమా లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ ‘శివ’ సినిమా. అరుదుగా అలాంటి సంఘటనలు జరుగుతాయి. ‘బాహుబలి’తో మళ్లీ జరిగింది. రాము (ఆర్జీవీ)కి నేను బ్రేక్ ఇచ్చాననడం నాకు నచ్చదు. ఇద్దరూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నాం. ‘శివ’ సీక్వెల్ చేద్దామని నా దగ్గరకు ఎందరో వచ్చారు. రాము తీస్తానంటేనే ‘శివ–2’ చేస్తా. లేకపోతే చేయను’’ అన్నారు నాగార్జున. రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘వంగవీటి’. దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా 23న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ‘శివ టు వంగవీటి : ద జర్నీ ఆఫ్ ఆర్జీవీ’ పేరుతో హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి రాలేకపోయినందుకు బాధగా ఉందని అమితాబ్‌బచ్చన్ వీడియో ద్వారా తెలిపారు.
వెంకటేశ్ మాట్లాడుతూ – ‘‘అప్పట్లో హీరోలందరం ‘మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాగ్‌గాడు ఒక్క చైన్ లాగి మొత్తం కొట్టేశాడు’ అనుకునేవాళ్లం. ‘శివ’కు ముందు ఫైట్స్‌లో హీరోలం అరిచేవాళ్లం. ‘శివ’ తర్వాత ఒక్క లుక్ అంతే. అన్నీ మారాయి’’ అన్నారు. ‘‘నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినా, డిప్రెషన్‌లోకి వెళ్లినా.. రాము ట్విట్టర్ అకౌంట్ చూస్తా. మనసులో అనుకున్నది చెప్తాడు. రామూ.. నువ్ ఎలా బతుకుతున్నావో అలాగే బతుకు. మారకు’’ అన్నారు నాగార్జున. వర్మ మాట్లాడుతూ – ‘‘ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు. పోయాడు అనుకుంటే మళ్లీ వస్తావు. మనిషివా? దెయ్యానివా? అని ట్విట్టర్‌లో కామెంట్ చేశాడొకడు. నాకా అర్హత ఉంది. నేనీ స్థాయికి వచ్చానంటే నాగార్జునే కారణం. ఇకపై నా సినిమాలన్నీ సూపర్‌హిట్స్ అవుతాయని చెప్పను. కానీ, గర్వంగా చెప్పుకునే సినిమాలు తీస్తానని రాజమౌళి, నాగార్జునలపై ఒట్టేస్తున్నా’’ అన్నారు.
‘‘కొన్నేళ్ల తర్వాత రాముగారు ప్రేమించి ఓ సినిమా (వంగవీటి) తీసి, ప్రమోట్ చేస్తున్నారు. చాలాసార్లు ట్రైలర్లతో ఆశపెట్టి నిరాశపరిచా రాయన. ఈసారి ‘మరణం..’ సాంగ్ చూశాక సినిమా పెద్ద హిట్ అనిపించింది. ఆర్జీవీ ఈజ్ బ్యాక్’’ అన్నారు రాజమౌళి. ‘‘వర్మగారితో నేను పాతికేళ్లుగా కాపురం చేస్తున్నాను. ఏరోజూ ఆయన మీద ప్రేమ తగ్గలేదు. ‘వంగవీటి’లో 40 నిమిషాలు చూశా. అద్భుతమైన సినిమా’’ అన్నారు పూరి జగన్నాథ్. ‘‘ఆర్జీవీ అనేది చలనచిత్ర చరిత్రలో ఓ శాస్వతమైన స్టాంప్. ‘శివ’, ‘వంగవీటి’లను కలిపితే ‘శివంగి’. అంటే.. పులుల్లో కూడా వర్మ ఆడపులినే ప్రేమిస్తాడు’’ అన్నారు తనికెళ్ల భరణి. చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకులు బి.గోపాల్, గుణశేఖర్, వైవీయస్ చౌదరి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, రాజకీయ నాయకుడు రేవంత్‌రెడ్డి, పారిశ్రామికవేత్తలు రఘురామరాజు, కోనేరు సత్యనారాయణ, నిర్మాతలు పీవీపీ, హీరో రాజశేఖర్, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.