
వర్మను వెంటాడుతున్న వంగవీటి వివాదం
వంగవీటి చిత్రంతో విజయవాడ రౌడీయిజాన్ని మరోసారి తెరమీదకు తెచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై వంగవీటి రాధ విజయవాడ క్రిమినల్ కోర్టులో కేసు వేశారు. వంగవీటి కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను తెరకెక్కించారని, సినిమా కారణంగా తమ పరవుపోయిందని వంగవీటి రాధ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విజయవాడ క్రిమినల్ కోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్పై కేసు వేశారు. తమ పేరును సినిమా టైటిల్ గా పెట్టి తమ పరువు తీశారని, సినిమాలో తమ కుటుంబానికి సంబంధం లేని అంశాలను చిత్రీకరించారని పేర్కోన్నారు.
సినిమా రిలీజ్కు ముందు వంగవీటి, దేవినేని కుటుంబాలను సంప్రదించిన వర్మ వారు చెప్పిన అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేశారు. రిలీజ్ సమయంలోనూ వంగవీటి వివాదాలకు కారణమయ్యింది. వంగవీటి రాధ, రత్నకుమారిలను కలిసిన వర్మ, చర్చలు ఫలించకపోవటంతో.. నన్ను చాలా పద్దతిగా బెదిరించారంటూ ఆరోపించాడు. అదే సమయంలో తను విజయవాడ రౌడీయిజాన్ని చాలా దగ్గరగా చూశానని, రాధ కన్నా అప్పటి పరిస్థితులు తనకే బాగా తెలుసని ట్వీట్లు చేయటం అప్పట్లో వివాదాస్పదమయ్యింది.