తెలుగులో నా చివరి సినిమా వంగవీటి: వర్మ | vangaveeti is my last telugu movie, says Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

తెలుగులో నా చివరి సినిమా వంగవీటి: వర్మ

Published Wed, Feb 10 2016 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

తెలుగులో నా చివరి సినిమా వంగవీటి: వర్మ

తెలుగులో నా చివరి సినిమా వంగవీటి: వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో ఉండే ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అని ఆయన బుధవారం వెల్లడించారు. వంగవీటి కంటే అద్భుతమైన కథ తనకు దొరకదని... శివ నుంచి ప్రారంభమైన తన ప్రస్థానం వంగవీటితో ఆగిపోతుందని వర్మ పేర్కొన్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు, దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ మేరకు వర్మ...ఓ ఆడియోను మీడియాకు విడుదల చేశారు.

నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా , నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో... ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు,చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే  నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న “వంగవీటికి” ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా.

పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్,శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ,ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషైనా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు ... రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటినుంచీ ఇప్పటివరకూ సాగుతూ వస్తున్న హింసచరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారధి అయితే రౌడీ ఒక మలుపు. ఫాక్షనిజం కి బ్యాక్ గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీయిజానికి వారసత్వం దమ్ము ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మునోడిని పైకి పంపటమే అసలు సిసలైన నిజమైన రౌడీయిజం.

అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు,బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. 'వంగవీటి' చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది.

 'శివ' తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం “వంగవీటి”తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం 'వంగవీటి'కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి.  వంగవీటి రాధాగారు,చలసాని వెంకటరత్నంగారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే 'వంగవీటి' చిత్రం.

 కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటాడోర్ వాన్లు వుండి,సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ళ క్రితంనాటి ఆ నాటి విజయవాడ వాతావరణాన్ని పున సృష్టించటానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దని 'వంగవీటి' నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, విజయవాడ గత చరిత్రని ఇప్పటికి, ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యటానికి మా'వంగవీటి' యూనిట్ శరవేగంతో సిద్ధమవుతోంది.

వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రదారులు:

వంగవీటి రాధా
వంగవీటి మోహన రంగా
వంగవీటి రత్నకూమారి
 దేవినేని నెహ్రు
దేవినేని గాంధీ
దేవినేని మురళి
కర్నాటి రామమోహనరావు
సిరిస్ రాజు
రాజీవ్ గాంధీ
దాసరి నారాయణ రావు
ముద్రగడ పద్మనాభం
నందమూరి తారక రామారావు


కాగా వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో 'వంగవీటి' చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఆ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన వంగవీటి రాధ క్యారెక్టర్లో నటించే నటుడి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు వంగవీటి రాధ, నా వంగవీటి రాధ అంటూ రాంగోపాల్ వర్మ ఈ ఫోటోలను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement