
‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు ప్రభాస్. దీంతో ఆయన సరసన ఒక్క ఛాన్స్ కోసం తెలుగులో నటిస్తున్న హీరోయిన్లే కాదు... పరభాషా చిత్రాల హీరోయిన్లూ ఆసక్తి చూపుతున్నారు. ప్రభాస్‌తో నటించే చాన్స్ రావాలే కానీ ఎవరు మాత్రం వదులుకుంటారు? అనేవారి జాబితాలోకి తాజాగా నటుడు శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి చేరారు.
తమిళంలో హీరోయిన్‌గా కొనసాగుతోన్న వరలక్ష్మి ‘శక్తి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రభాస్‌తో కలిసి నటిస్తారా? అని చాలామంది అడుగుతున్నారు. ఆయనతో నటించాలని అందరూ అనుకుంటారు. ఆ అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ నటన సూపర్బ్. నాకు చాలా బాగా నచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి టాలెంట్ ఉన్న నటులున్నారు. వారితోనూ సినిమాలు చేయాలనుంది’’ అన్నారు.