చెన్నై, సినిమా: రాష్ట్ర ప్రభుత్వం మరీ అంత బలహీనంగా ఉందా అంటూ నటి వరలక్ష్మీశరత్‌కుమార్ వెటకారం చేశారు. సమకాలీన పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించే ఈ సంచలన నటి ప్రస్తుతం సర్కార్ వర్సెస్ సర్కార్ (సర్కార్ చిత్రం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం) మధ్య జరుగుతున్న రచ్చపై తీవ్రంగానే స్పందించారు. విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం సర్కార్. కీర్తీసురేశ్ కథానాయకిగా నటించిన ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రతికథానాయకి పాత్రలో రాజకీయనాయకురాలిగా నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకుడు. ఇంతకు ముందే ఈ చిత్ర కథ వివాదంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ స్పందిస్తూ దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌కు మద్దతుగా నిలిచారు. ఆ వివాదంలో ఏఆర్.మురుగదాస్ తగిన మూల్యం చెల్లించారనే ప్రచారం జరిగింది. తాజాగా తెరపైకి వచ్చిన సర్కార్ చిత్రంపై అన్నాడీఎంకే నేతలు ఒక్క సారిగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలా విషయాలు జరిగిపోయాయి.
అన్నాడీఎంకే కార్యకర్తలు సర్కార్ చిత్ర ప్రదర్శన థియేటర్లపై దాడి చేయడం, పోస్టర్లు, బ్యానర్లు చించేయడం లాంటి సంఘటనలతో పాటు, కొన్ని థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేయడం, సర్కార్ చిత్ర వర్గాలు దిగిరావడం, చిత్రంలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించడానికి అంగీకరించడం, హుటాహుటిన ఆ పని కూడా జరిగిపోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. అంతేకాదు ముఖ్యమంత్రిని నటుడు విజయ్ శుక్రవారం కలవడానికి అపాయింట్‌మెంట్ కోరినట్లు కూడా సమాచారం. మొత్తానికి సర్కార్ గొడవ సద్దుమణిగినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ఒక చిత్రాన్ని చూసి భయపడేంతగా ప్రభుత్వం బలహీనంగా ఉందా మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తూ మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు. ఇలాంటి తెలివి తక్కువ చేష్టలు చేయడం మానుకోండి. క్రియేటివిటీ స్వేచ్ఛను హరించకండి అని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మరి ఈ అమ్మడి వ్యాఖ్యలకు అన్నాడీఎంకే నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఇందులో వరలక్ష్మీశరత్‌కుమార్ పాత్ర పేరు కోమళవళ్లి (ఇది జయలలిత అసలు పేరు అన్నది గమనార్హం). అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉచిత పథకాల సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించారు. ఇలా అన్నాడీఎంకే నేతలు అభ్యంతరం చెప్పిన సన్నివేశాలను తొలగించి సర్కార్ చిత్రాన్ని రీ సెన్సార్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. సర్కార్ చిత్రంలో కట్ చేసిన సన్నివేశాలను విజయ్ అభిమానులు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తూ తమ వీరాభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment