క్రిష్ దర్శకత్వంలో?
‘గ్రీకు శిల్పంలా ఉంటాడు వాడు’... వరుణ్‌తేజ్‌ను ఉద్దేశించి చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది. ఆయన అనడం కాదు కానీ... నిజంగానే వరుణ్ అంత అందగాడే. తొలి చూపులోనే అందరి దృష్టినీ ఆకర్షించేశాడు. మెగా అభిమానులందరూ అతని తొలి సినిమా ‘ముకుందా’ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసే పనిలో ఉన్నారిప్పుడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వక ముందే... మరో సినిమాకు వరుణ్‌తేజ్ పచ్చజెండా ఊపేసినట్టు సమాచారం. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం క్రిష్.. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో ‘గబ్బర్’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘గబ్బర్’ తర్వాత క్రిష్ చేసే సినిమా ఇదేనట. క్రిష్ అభిరుచికి తగ్గట్టుగా, నటునిగా వరుణ్‌తేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లే రీతిలో ఉండే కథాంశాన్ని క్రిష్ సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. క్రిష్ సొంత నిర్మాణ సంస్థ ‘ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్’పై ఈ చిత్రం రూపొందనుందనీ, ‘ముకుందా’ తర్వాత వరుణ్ నటించే సినిమా ఇదే అవుతుందని సినీ వర్గాల టాక్.