కరీనా కపూర్ పెళ్లి సైఫ్ అలీ ఖాన్‌తో అయింది కదా! ఇప్పుడు పెళ్లికి ఆహ్వానం ఏంటి? అని ఆశ్చర్యపోవచ్చు. అసలు విషయంలోకి వెళదాం. చిన్న చిన్న ఫంక్షన్స్‌కి రెడీ అవ్వడం అంటేనే ఆడవాళ్లకు అదో పెద్ద విషయం. చీర అంటే దానికి తగ్గ నగలు, లెహెంగా అంటే దానికి మ్యాచింగ్ జ్యువెలరీ... పెట్టుకొనే బొట్టు, వేసుకునే జడ, దిద్దుకునే కాటుక, లిప్‌స్టిక్... ఇలా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటారు.
ఇక్కడున్న రెండు ఫొటోల్లో ఒక ఫొటోలో అమ్మాయిలు సీరియస్‌గా రెడీ అవుతున్న దృశ్యాన్ని చూస్తున్నారు కదా. ఒక బ్యూటీ ఇంకో బ్యూటీకి కొంగు సాయం చేస్తోంటే, మరో సుందరి పాదరక్షలు వేసుకుంటోంది. ఇంకో అమ్మాయి జాకెట్ హుక్స్ పెట్టడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా? అన్నట్లు చూస్తోంది.
ఇక, ఒక అమ్మాయి మాత్రం ఏ యాక్టివిటీ లేకుండా అలా నిలబడి ఉంది. అంటే... ఆల్రెడీ రెడీ అయిందన్న మాట. ఇంతకీ ఈ నలుగురూ ఎవరంటే? కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానియా. ఈ నలుగురి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘వీరీ ది వెడ్డింగ్’. కరీనా కపూర్ పెళ్లి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సినిమా మొత్తం వేడుకలే. పెళ్లికి అందరూ రెడీ అవుతున్న ఒక ఫొటోను ఫస్ట్ లుక్‌గా చిత్రబృందం విడుదల చేసింది. బుధవారం మరో స్టిల్ రిలీజ్ చేసింది. ‘ముహూర్తం ఫిక్స్’ అనే పోస్టర్ అది. అంటే... విడుదల తేదీ ముహూర్తం అన్నమాట.
‘ఇదే మా ఆహ్వానం.. సేవ్ ది డేట్’ అని రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది మే 18న ఈ చిత్రం విడుదల కానుంది. శశాంకా ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమాలో కరీనా పెళ్లి వేడుకలు పసందుగా ఉంటాయట. విడుదల చేసిన రెండు లుక్స్‌లో ఆ కళ కనిపిస్తోంది కదూ! నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఇంగ్లిష్ మూవీ ‘క్విక్ గన్ మురుగన్’ తీసిన శశాంకా హిందీలో ‘ముంబై కట్టింగ్’, ‘కూబ్‌సూరత్’ సినిమాలు తీశారు. వీటిలో ‘ముంబై కట్టింగ్’ 11 కథలతో తీసిన సినిమా. ఒక కథకు శశాంకా దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment