జపాన్‌లో అంజలితో వెంకీ డ్యూయెట్
వెంకటేష్, రామ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘మసాలా’. ఇప్పటివరకూ పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నా, ఫైనల్‌గా ‘మసాలా’ టైటిల్‌నే చిత్ర బృందం ఓకే చేసింది. ఇందులో అంజలి, షాజన్ పదంసీ కథానాయికలు.
బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన రొమాంటిక్, యాక్షన్, కామెడీ చిత్రం ‘బోల్‌బచ్చన్’కి ఇది రీమేక్. విజయ భాస్కర్ దర్శకుడు. డి.సురేష్‌బాబు సమర్పణలో స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో అంజలి తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. సెప్టెంబర్ 3 నుంచి 9 వరకూ జపాన్‌లోని హొకిడోలో బ్యాలెన్స్ పాటను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటేష్, అంజలిపై జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఈ పాటను చిత్రీకరిస్తారు. అతి త్వరలో పాటలను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.