స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను | Viacom18 launches Colors Telugu on Voot | Sakshi
Sakshi News home page

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

Published Fri, Sep 20 2019 12:30 AM | Last Updated on Fri, Sep 20 2019 8:23 AM

Viacom18 launches Colors Telugu on Voot - Sakshi

‘‘నేను చేసిన ఏ షో అయినా నేను కాకుండా వేరే ఎవరూ చేయలేరు. నేను చేసిన షోలకు వచ్చిన సెలబ్రిటీలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో వారికి తెలుసు కాబట్టి నేను మాత్రమే చేయగలను అని గట్టిగా చెబుతున్నాను’’ అంటున్నారు ప్రముఖ నటి, నిర్మాత, హోస్ట్‌ లక్ష్మీ మంచు. ‘ఊట్‌’ అనే యాప్‌ ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ‘ఫీట్‌ అప్‌ విత్‌ ద స్టార్స్‌ తెలుగు’ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారామె. ఈ నెల 23వ తేదీ నుండి ‘కలర్స్‌ తెలుగు’ అనే బ్రాండ్‌ పేరుతో ఈ షో విడుదల అవుతుంది.  ‘‘బాలీవుడ్‌కి చెందిన ప్రసిద్ద ఎంటర్‌టైన్మెంట్‌ బిజినెస్‌ కంపెనీ వయాకామ్‌ 18తో అసోసియేట్‌ అయి, ఇంత మంచి షో నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు లక్ష్మీ. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు చెప్పారామె.

► బాలీవుడ్‌లో ఇలాంటి షోలు చేయటం చాలా ఈజీ. ఎందుకంటే అక్కడి స్టార్స్‌ వారి స్టార్‌డమ్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌ను షేర్‌ చేసుకోవటానికి ఇష్టపడతారు. కానీ, ఇక్కడి పరిస్థితి వేరు. రీల్‌ లైఫ్‌లో హీరో అంటే రియల్‌ లైఫ్‌లో కూడా హీరోలా ఉండాలని కోరుకుంటారు. వృత్తిపరంగా వాళ్లు హీరోలు, హీరోయిన్లే. వ్యక్తిగతంగా చాలా మంచి హ్యూమన్‌ బీయింగ్స్‌. ఆ కోణాన్ని  బయటకు తీసే ప్రయత్నమే నా షో. మొదటిసారి ఇలాంటి ఒక షోను నేను తెలుగులో ప్రముఖ తారలతో చేస్తున్నాను. అది నా క్రెడిట్‌.

► ఒక బెడ్‌ మీద సెలబ్రిటీస్‌తో ఇంటర్వూ అంటే ఎలా ఉంటుందో అని మొదట నేనే కొంచెం జంకాను. కానీ షోకి వచ్చిన స్టార్స్‌ అంతా కంఫర్టబుల్‌గా ఫీలయ్యారు. ఈ షూటింగ్‌ బెడ్‌ సెట్‌ మా ఇంట్లోనే వేశాం. కారణం భారతదేశంలోని  ప్రముఖ నటీనటులంతా ఎన్నోసార్లు ఈ ఇంట్లో భోజనం చేశారు. వాళ్లంతా తిరిగిన ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం. అంతేకాకుండా ఫ్రీ కూడా. సమంత ఈ షోకు వచ్చినప్పుడు,  ‘‘పాపా.. నీ పని బాగుంది. పై నుంచి క్రిందకు దిగితే లొకేషన్‌. మేం రోజూ నిద్ర లేవగానే షూటింగ్‌ లొకేషన్‌ అంటూ ఎక్కడెక్కడికో వెళ్లాలి’ అంది.

► నేను చేసే ప్రతి షో ద్వారా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. లక్ష్మీ టాక్‌ షోలో అడిగిన  ప్రశ్నలను ఈ షోలో అడగను. సెలబ్రిటీస్‌ కొన్ని వందల ఇంటర్యూలు ఇచ్చి ఉంటారు. ఆ ఇంటర్వూల్లో చెప్పినవి నా షోలో ఉండవు. అంతకుమించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. కానీ, నా షోకి వాళ్లను నైట్‌ డ్రెస్‌లో రమ్మన్నాను. అది వాళ్లకి, నాకు మధ్యలో ఉన్న సాన్నిహిత్యం అని చెప్పొచ్చు.

► ఏ సెలబ్రెటీ లైఫ్‌ అయినా ప్రతి ఆరు నెలలకోసారి మారుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి సమంతానే తీసుకుందాం. చైతూతో పెళ్లికి ముందు ఓలాగా, పెళ్లి తర్వాత లైఫ్‌ ఓలాగా ఉంటుంది. ప్రభాస్‌ని తీసుకుంటే ‘బాహుబలి’ ముందు, తర్వాత అని చెప్పాలి. అవే నా షోలో అందంగా అడుగుతాను. ఈ ఇంటర్వూ వల్ల ఎవరి ఇమేజ్‌ మారదు. ఇట్స్‌ ఏ సింపుల్, ఫన్,  హార్ట్‌ వార్మింగ్‌ షో మాత్రమే.

► ఇదే షోను పొలిటికల్‌ వాళ్లతో చేయలేం. వాళ్లంటే నాకు భయం. బెడ్‌ మీద కూర్చుని ఇంటర్వూ అంటే చాలా కష్టం.  కానీ వాళ్లతో కావాలంటే కార్‌ డ్రైవ్‌ చేస్తూ ఇంటర్వూ చేస్తాను. నేను గతంలో వెబ్‌ సిరీస్‌ చేశాను. అది చాలా కష్టం. నాలుగు సినిమాలు చేసినంత కష్టంగా ఉంటుంది.

► ఇప్పటివరకు చేసిన అందరిలో వరుణ్‌ తేజ్‌ ఎపిసోడ్‌ చాలా బోల్డ్‌గా వచ్చింది. నానీతో త్వరలో షూట్‌ చేస్తాను. నాకున్న బలం ఏంటంటే.. చాలామంది ఆడవాళ్లు నా దగ్గరకొచ్చి ‘థ్యాంక్స్‌ లక్ష్మీ.. నీ వల్ల నేను నాకు ఇష్టం వచ్చినట్లు హ్యాపీగా ఉంటున్నాను’ అంటారు. అప్పుడు నేను గెలిచాను అనిపిస్తుంది.

► ప్రస్తుతం ప్రపంచం చిన్నగా అయిపోయింది. ఒకప్పుడు మా నాన్న ఊటీలో షూటింగ్‌లో ఉంటే మేము ఫోన్‌ పక్కన కూర్చుని ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడు హాలీవుడ్‌ తార కిమ్‌  కర్దషియాన్‌ తన బెడ్‌ రూమ్‌లో ఏం చేస్తుందో నేను నా బెడ్‌ రూమ్‌లో కూర్చుని చూస్తున్నానంటే ప్రపంచం ఎంత చిన్నదైందో చూడండి. మన ట్రెడిషన్‌ వదులుకోకుండా మారుతున్న పరిస్థితులను బట్టి మనమూ మారుతుండాలి.

► నా కూతుర్ని నీవు అమ్మాయా, అబ్బాయా అని అడిగితే నేను మనిషిని అని చెబుతుంది. ఎందుకు చెబుతున్నానంటే ప్రపంచం మారుతుంది. ఫీట్‌ అప్‌ అంటేనే ఇంకొంచెం దగ్గరిగా కంఫర్ట్‌గా ఉండటం అని. నా షోలో చాలా సీక్రెట్స్‌ ఉంటాయి. అవి బయటకు వస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement