నిర్మాత ప్రియుడు.. నాయకి ప్రియురాలు | Vignesh Shivan To Produce Nayantara Next Movie | Sakshi
Sakshi News home page

నిర్మాత ప్రియుడు.. నాయకి ప్రియురాలు

Published Sun, Aug 25 2019 6:29 AM | Last Updated on Sun, Aug 25 2019 6:29 AM

Vignesh Shivan To Produce Nayantara Next Movie - Sakshi

ప్రియురాలు నాయకిగా ప్రియుడు చిత్రం నిర్మించడానికి సిద్ధం అవుతున్నాడన్నది తాజా సమాచారం. సంచలన నటి నయనతార కథానాయకిగా నటించనున్న చిత్రాన్ని దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ నిర్మించనున్నారు. అగ్రనటి నయనతార నటించిన నాలుగు చిత్రాలు ఈ ఏడాది తెరపైకి వచ్చాయి. అజిత్‌కు జంటగా నటించిన విశ్వాసం, హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రల్లో నటించిన ఐరా, కొలైయుధీర్‌ కాలం చిత్రాలతో పాటు శివకార్తికేయన్‌కు జంటగా నటించిన మిస్టర్‌ లోకల్ చిత్రాలు విడుదలయ్యాయి‌.

కాగా వీటిలో విశ్వాసం మినహా మిగిలిన మూడు చిత్రాలు నయనతారకు నిరాశనే మిగిల్చాయి. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా భారీ చిత్రాలే ఉన్నాయి. రజనీకాంత్‌ సరసన నటిస్తున్న దర్బార్, విజయ్‌తో జత కట్టిన బిగిల్, తెలుగులో చిరంజీవికి జంటగా తొలిసారిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి, తెలుగులో లవ్‌ యాక్షన్‌ డ్రామా చిత్రాలు ఉన్నాయి. కాగా ఈ నాలుగు చిత్రాల నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.

వీటిలో సైరా చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న, విజయ్‌తో నటిస్తున్న బిగిల్‌ దీపావళికి, రజనీకాంత్‌తో నటిస్తున్న దర్బార్‌ సంక్రాంతికి అంటూ వరుసగా తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. ఇక నయనతారకు నెక్ట్స్‌ ఏంటీ? అన్న ప్రశ్న తలెత్తేలోపే ఈ బ్యూటీ కొత్త చిత్రానికి రెడీ అయ్యిపోతోంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే తన తదుపరి చిత్రాన్ని ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ నిర్మించనుండడమే.

అవును ఈ మధ్య నయనతార నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోవడంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నయనతార సిద్ధమైంది. అందుకు నిర్మాతగా తన ప్రియుడినే ఎంచుకుంది. అంటే ఒక రకంగా సొంత నిర్మాణమే అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహించనున్నారు.

మిలింద్‌ ఇంతకు ముందు సిద్ధార్థ్‌ సొంతంగా నిర్మించి కథానాయకుడిగా నటించిన అవళ్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం 2017లో విడుదలై మంచి విజయాన్ని సాధించి నటుడు సిద్ధార్థ్‌ను హిట్‌ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది.ఇక నయనతార నటించనున్న కొత్త చిత్రంలో కుక్క కీలక పాత్రను పోషించనుందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement