ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కోవిడ్-19 (కరోనా వైరస్) భారత్‌లోకి చొరబడిపోయింది. భాగ్యనగరంలో కరోనా అనుమానిత కేసులు నమోదవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా పేరు వినిపిస్తేనే కంగారుపడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా 3800 మందికి పైగా మరణించగా, ఒక్క చైనాలోనే కోవిడ్ మరణాల సంఖ్య 3136కి చేరుకుంది. ఇక కరోనా గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు లెక్కే లేదు. దీంతో వైరస్ గురించి భయాన్ని విడనాడి, దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. (కరోనా అలర్ట్: పెళ్లిళ్లు, పేరంటాలు బంద్!)
ఇందుకోసం హీరో విజయ్ దేవరకొండతో చేతులు కలిపింది. ఈ మేరకు అతనితో కరోనా వైరస్ గురించి అవగాహన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఓ యాడ్‌ను రూపొందించింది. ఇందులో ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించింది. వ్యాధి లక్షణాలు ఉంటే 104కు కాల్ చేయాల్సిందిగా కోరింది. ఈ ప్రకటన అతి త్వరలో అన్ని టీవీ చానల్స్‌లోనూ ప్రసారం కానుంది. కాగా విజయ్ సినిమాల విషయానికొస్తే పూరీ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ చిత్రంలో నటిస్తున్నాడు. 40 రోజుల ముంబై షెడ్యూల్ ఈ మధ్యే పూర్తి కాగా చిన్న విరామం తర్వాత కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. (నో కోవిడ్.. హైదరాబాద్ సేఫ్!)
Comments
Please login to add a commentAdd a comment